నెల్లూరులో 42 మంది స్వాములను కాపాడి ప్రాణాలు వదిలిన డ్రైవర్..
శబరిమలకు అయ్యప్ప స్వాములను తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, నెల్లూరులో హఠాత్తుగా డ్రైవరుకి గుండెపోటు వచ్చింది. అయినా ప్రయాణీకులను కాపాడాలనే ఉద్దేశంతో పంటిబిగువున నొప్పి భరిస్తూ బస్సును పక్కకు ఆపి 42 మంది అయ్యప్ప స్వాముల ప్రాణాలు కాపాడి ఆ తర్వాత ప్రాణాలు విడిచాడు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్. ఈ నెల 16న కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన 42 మంది అయ్యప్ప స్వాములు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శబరిమల వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గురువారం సాయంత్రం నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల చెరువు వరకు వచ్చారు. ఈ సమయంలో డ్రైవర్ భాస్కర్ రావుకు హఠాత్తుగా గుండె పోటు వచ్చింది.
డ్రైవర్ ఆ నొప్పిని భరిస్తూ బస్సును కొంత దూరం నడిపారు. కానీ ఫ్లై ఓవర్ పైకి వెళ్లాక నొప్పిని భరించలేక చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన ఆపారు. సేదతీరేందుకు యత్నించగా, అలాగే ప్రాణాలు కోల్పోయాడు. మరో డ్రైవర్ సాయంతో బస్సును తీసుకెళ్లారు. భాస్కర్ రావు చేసిన సాహసానికి అయ్యప్ప స్వాములు కంట తడి పెట్టుకున్నారు. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించారు. అదే ఏపీలో మరో సంఘటన జరిగింది. భద్రాచలం నుంచి కాకినాడు వెళ్తున్న కాకినాడ డిపో బస్సు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డు వద్దకు రాగానే బ్రేకులు ఫెయిలయ్యాయని డ్రైవర్ సుబ్బారావు గుర్తించాడు. వెంటనే ప్రయాణీకులను అప్రమత్తం చేసి రెండు మలుపులు తిరిగిన తర్వాత సమయస్పూర్తితో రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రెండు కాళ్లు ఇరుక్కుపోగా, బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సుబ్బారావు తెలివిగా ఆలోచించకపోతే తమ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ప్రయాణీకులు డ్రైవరుని అభినందించారు.