ఈ నెల 17న హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రూ.7 కోట్ల విలువైన ఆభరణాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా తన స్వగ్రామం కొవ్వూరు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నిందితుడి కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు చెప్పారు.ఎత్తుకెళ్లిన బంగారు, వజ్రాభరణాలను అడవితో గొయ్యి తీసి దాచిపెట్టగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన రాధిక అనే మహిళా జ్యువెలరీ వ్యాపారి వద్ద శ్రీనివాస్ (28) అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా కొన్నాళ్ల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు. ప్లాన్ ప్రకారం ఓ కస్టమర్‌కి ఇవ్వాల్సిన రూ.7 కోట్ల నగలను ఆమెకు అందించకుండా కారుతో పరారయ్యాడు. కూకట్‌పల్లి సమీపంలో ఉన్న మెట్రో షాపింగ్ మాల్ పార్కింగ్‌లో కారు వదిలేశాడు. బంగారం, వజ్రాభరణాలను బ్యాగ్‌లో సర్దేసి ఆటో ఎక్కి మాదాపూర్‌లోని యజమానురాలు రాధిక ఉండే మైహోం భోజ అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నాడు.
అక్కడ పార్కింగ్‌లో ఉంచిన తన బైక్‌పై శంషాబాద్ చేరుకొని శ్రీశైలం హైవే రూట్‌లో వెళ్లాడు. యజమానురాలి డెబిట్ కార్డును ఉపయోగించి కొత్త సెల్‌ఫోన్, సిమ్ కార్డు కొన్నాడు. అనంతరం వరంగల్ సమీపంలోని నర్సంపేటలో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్లాడు. చోరీ చేసొచ్చిన విషయాన్ని దాచి కొత్తఫోన్, కొత్తసిమ్‌ను బంధువుకు ఇచ్చి అతడి ఫోన్‌ను సిమ్‌కార్డును శ్రీనివాస్ తీసుకున్నాడు. బంగారు వజ్రాభరణాలను కారు డ్రైవర్ శ్రీనివాస్ చోరీచేసి పారిపోయాడని టీవీల్లో వచ్చే వార్తలను చూసిన బంధువు శ్రీనివాస్‌కు ఫోన్ చేసి చెప్పాడు. కంగారు పడొద్దని బంధువును శ్రీనివాస్ సముదాయించాడు.
హైదరాబాద్ నుంచి పారిపోయిన శ్రీనివాస్ తన స్వస్థలమైన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చేరాడు. జిల్లాలోని కొవ్వూరు వెళ్లి అక్కడ అడవిలో గొయ్యి తవ్వాడు. కాజేసి తెచ్చిన రూ.7 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను గోతిలో దాచి పెట్టాడు. శ్రీనివాస్ యజమానురాలి ఏటీఎం కార్డుతో కొన్న కొత్త ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా శ్రీనివాస్ బంధువును పట్టుకున్నారు. ఆ తర్వాత అతడు ఇచ్చిన సమాచారంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. బంగారు వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగలకు సంబంధించి ఎటువంటి పత్రాలు, బిల్లులు లేకపోవడంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారమిచ్చారు. పూర్తి వివరాలను రాబడుతున్నారు. ఒకవేళ ఆ నగలకు సరైన ఆధారాలు చూపించనట్లయితే యజమానురాలు రాధిక కూడా చిక్కుల్లో పడే అవకాశముంది.