డ్రోన్ ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో డ్రోన్ గమనాన్ని గుర్తించిన సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్).. ఆ డ్రోన్‌ను పేల్చేశాయి. పాకిస్థాన్ నుంచి నార్కోటిక్స్ తీసుకొస్తున్న ఓ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్ఎఫ్ మహిళా సిబ్బంది దాన్ని కూల్చేశారు. అందులో 3.1 కేజీల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అమృత్‌సర్‌లోని చహర్‌పూర్ గ్రామంలో గల భారత్ – పాక్ సరిహద్దు వద్ద మోహరించిన బలగాలు.. సోమవారం రాత్రి 11.05 గంటల సమయంలో ఓ డ్రోన్ పాకిస్థాన్ వైపు నుంచి రావడం గుర్తించాయి. అప్రమత్తమైన దళాలు వెంటనే యాంటీ డ్రోన్ వ్యవస్థతో కాల్పులు జరిపి ఆ డ్రోన్‌ను కూల్చివేసినట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత చేపట్టిన తనిఖీల్లో పాక్షికంగా ధ్వంసమైన ఓ హెక్సాకాప్టర్‌ను భద్రతాసిబ్బంది గుర్తించారు. 18 కేజీల బరువున్న ఈ డ్రోన్‌లో 3.11 కేజీల నార్కోటిక్స్ ఉన్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. 4 రోజుల క్రితం కూడా అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ పాకిస్థానీ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ సిబ్బంది కూల్చేశారు.