కోర్టులో పోలీసుల చెప్పిన సాక్ష్యం విని.. నిందితులను నిర్ధోషులుగా ప్రకటించారు న్యాయమూర్తి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. తమిళనాడు చెన్నైలోని కోయంబెడులో వింత ఘటన జరిగింది. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో స్వాధీనం చేసుకున్న గంజాయిని అడగగా.. ఎలుకలు తిన్నాయంటూ విచిత్ర సమాధానం చెప్పారు. ఆ సమాధానం విని జడ్జీ పోలీసులను మందలించారు. అసలేం జరిగిందంటే.. 2018లో చెన్నై కోయంబెడు బస్ స్టేషనులో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న సేలంకి చెందిన కల్పన, విశాఖపట్నంకి చెందిన కుమారి, నాగమణిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 30కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అయితే శనివారం స్వాధీనం చేసుకున్న గంజాయిని స్పెషల్ కోర్టుకు సమర్పించారు. గంజాయి బరువులో తేడా ఉండడంతో న్యాయమూర్తి ఆ విషయమై ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ లో 30కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు నమోదు చేయగా.. 19 కేజీలు మాత్రమే సమర్పించారు. దీనిపై సంబంధిత పోలీసు అధికారిని ప్రశ్నించగా .. గంజాయిని పోలీస్ స్టేషనులో ఉంచామని.. వర్షాల వల్ల గంజాయి పెట్టిన గది పాడైపోయిందని చెప్పారు. అక్కడ ఎలుకలు కూడా ఎక్కువగా ఉన్నాయని.. అవే గంజాయిని తిన్నాయని.. అందుకే వాటి బరువు తగ్గిందని పోలీసు అధికారి విచిత్ర సమాధానం చెప్పాడు. దీంతో ముగ్గురు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను అందించడంలో పోలీసులు విఫలమయ్యారని.. అరెస్టు చేసిన వారిని నిర్దోషులుగా విడుదల చేయాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.