డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదు.. సిట్ - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదు.. సిట్

May 15, 2019

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు క్లీన్ చీట్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అది పూర్తిగా అవాస్తవం అని ట్విస్ట్ ఇచ్చారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ కేసులో సినీ ప్రముఖులు సహా ఏ ఒక్కరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదని స్పష్టంచేశారు.  మీడియాలో వస్తున్న సమాచారం ఇప్పటిది కాదని, 2018 జూన్‌ 13న ఇచ్చిన సమాచారమని అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌, ప్రస్తుతం పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా ఉన్న అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. అదనపు చార్జిషీట్లు వేయాల్సి ఉందన్నారు.

ఈ కేసులో సంబంధం వున్న ఏ ఒక్కరినీ వదలమని, ఈ కేసుపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని స్పష్టంచేశారు. రెండేళ్ల క్రితం తెలుగు సినిమా ప్రముఖులపై నమోదు చేసిన డ్రగ్స్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని చెప్పారు.

మొత్తం 12 కేసుల్లో ఇప్పటి వరకు 7 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ మరో 5 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు సందర్భంగా మొత్తం 62 మంది నటీనటులు, దర్శకులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులను విచారించినట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించినట్లుగా తెలిపారు. వారి ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాయని వెల్లడించారు.

2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరా చేసిన అలెక్స్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో సినీ తారల పేర్లు ఒక్కక్కటిగా బయటికొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. పూరి జ‌గ‌న్నాధ్‌, ర‌వితేజ‌, ఛార్మీ, ముమైత్ ఖాన్, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బ‌రాజు, నవపాద ధర్మారావ్ (చిన్నా), శ్రీనివాస్ (రవితేజ్ కారు డ్రైవర్), నందు సహా పలువురు సెలబ్రిటీలను విచారించారు. మొత్తం 12 కేసులు నమోదుచేసిన పోలీసులు ఇప్పటి వరకు 7 చార్జిషీట్లు దాఖలు చేశారు. చార్జిషీట్లలో సినీ ప్రముఖుల పేర్లు లేవని ప్రచారం జరగడంతో అధికారులు స్పందించారు.