డ్రగ్స్ కేసుతో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్..! - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసుతో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్..!

July 25, 2017

డ్రగ్స్ కేసుపై డైరెక్టర్ వర్మ పోస్టుల పరంపర కొనసాగుతోంది.నిన్నటిదాకా అకున్ సబర్వాల్ కార్నర్ గా ట్వీట్లు చేసిన వర్మ మరో అడుగు ముందుకు వేశాడు. ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి ,ప్రభుత్వానికి కేసును ముడిపెట్టేశాడు. సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ వాడుతున్నట్లు మీడియాను తప్పుదోవ పట్టించడం వెనుక పెద్ద కుట్ర జరుగుతున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించాడు. చాలామంది చెబుతున్నట్లుగా ఈ కేసులో ఎంతోమంది బడా బాబులు ఇన్వాల్వ్ కాలేదా అని క్వశ్చన్ చేశాడు.

డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యాక.. విచారణకు సంబంధించిన వీడియోలను మీడియాకు విడుదల చేయడం లేదనీ, ప్రజలకు ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలు తెలియక్కర్లేదా అని వర్మ నిలదీశాడు. ఈ కేసుతో హైదరాబాద్ కీర్తికి, ఘనతకు భంగం కలిగిందన్నాడు. ముంబై ప్రజలు చాలామంది హైదరాబాద్ ఇంత చెడిపోయిందని తమకు తెలియదని తనతో అంటున్నారని చెప్పాడు.కొంతమందిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికే చెడ్డ పేరు వచ్చిందని అభిప్రాయపడ్డాడు.

కేసీఆర్ పేరును, తెలంగాణ పేరును అకున్ సబర్వాల్, చంద్రవదన్ కాపాడతారని ఆశిస్తున్నానని వర్మ కామెంట్ చేశాడు. బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు రాష్ట్రాల సత్తా ఏంటో దేశానికి చాటిచెప్పాడని, అయితే అకున్ సబర్వాల్, ఆయన బృందం భారతీయులంతా తెలుగు రాష్ట్రాలను చిన్నచూపు చూసే విధంగా చేశారని వర్మ వ్యాఖ్యానించాడు. ఇకనైనా సిట్ విచారణను సక్రమ రీతిలో నిర్వహిస్తుందని ఆశిస్తున్నట్లు వర్మ అన్నాడు. బాహుబలి2 తెలుగు రాష్ట్రాల కీర్తిని అగ్రస్థానంలో నిలబెడితే, డ్రగ్స్ స్కాం తెలుగు రాష్ట్రాల కీర్తిని దిగజార్చిందని అంటున్నాడు.