నగరంలో డ్రగ్స్‌కు బానిసై బీటెక్ విద్యార్ధి మృతి చెందిన సంఘటన సంచలనం రేపుతోంది. వెంటనే కార్యాచరణలోకి దిగిన పోలీసులు నల్లకుంట, జూబ్లీహిల్స్ పరిధుల్లో సెర్చ్ చేసి ఆరుగురు అనుమానితులను పట్టుకున్నారు. వారి నుంచి మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. శివం రోడ్డులో డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమ్ అనే వ్యక్తిని ముందుగా అరెస్ట్ చేయగా, అతనిచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు చనిపోయిన బీటెక్ విద్యార్ధి కలిసి తరచూ గోవా వెళ్లి డ్రగ్స్ సేవించేవారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో డోసు ఎక్కువై విద్యార్ధి చనిపోయాడని అంచనాకు వచ్చారు. మరోవైపు ఇంటర్నెట్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న శ్రీరామ్ అనే వ్యక్తిని జూబ్లీహిల్స్‌లో అరెస్ట్ చేశారు. అతనితో పాటు దీపక్ అనే కస్టమర్‌ను కూడా అరెస్ట్ చేసినట్టు అదనపు కమిషనర్ ఎల్. ఎస్. చౌహాన్ వెల్లడించారు.