దగ్గుకు మాత్రలెందుకు? ఈ చిట్కాలతో తరిమేయండి! - MicTv.in - Telugu News
mictv telugu

దగ్గుకు మాత్రలెందుకు? ఈ చిట్కాలతో తరిమేయండి!

September 6, 2019

kitchen tips .

వానాకాలం రాగానే వాతావరణంలో మార్పుల వల్ల చాలామందికి దగ్గు, జలుబు పట్టుకుంటాయి. శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. దగ్గు మన ఊపిరితిత్తులకు మంచి రక్షణ లాంటిది. దగ్గు వీడకుండా వేధిస్తున్నప్పుడు దుగ్గు మందు తాగేసి, దాన్ని అణిచివెయ్యాలని ప్రయత్నించకుండా అసలు దగ్గుకు కారణం ఏంటో తెలుసుకుని, దానికి తగిన చికిత్స తీసుకోవాలి. దగ్గు ముందులు తాత్కాలికంగా దగ్గును అణిచివేస్తాయిగానీ లోపల అసలు సమస్య అలాగే ఉండి, అది మరింత ముదురుతుంటుంది. దగ్గు మూడు రకాలుగా వస్తుంది. కఫం లేని పొడి దగ్గు, మామూలు కఫంతో కూడిన దగ్గు, రక్త కఫంతో కూడిన దగ్గు.

జలుబు, దగ్గు మిక్స్ అయి వచ్చినప్పుడు చాలా చిరాకు వేస్తుంది. వెంటనే ఆస్పత్రికి పరుగులు పెట్టి ఆ మందులు, ఈ మందులు వేసుకుంటాం. దగ్గుకు రకరకాల టానిక్కులు, మందులు వున్నాయి. అయితే దగ్గు రాగానే వాటి జోలికి వెళ్లకుండా మన వంటింట్లోని పోపుల పెట్టెలోకి తొంగిచూస్తే దగ్గు, జలుబులను తగ్గించుకోవచ్చు. దగ్గును అణిచివేసే మందులు నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మలబద్దకం కూడా మొదలవ్వచ్చు అంటున్నారు. కొన్ని దగ్గు మందులతో మగత, అలసట వంటి సమస్యలు రావచ్చు. కొన్ని దగ్గు మందులు తీసుకున్న తర్వాత మత్తుగా అనిపించవచ్చు. కాబట్టి వీటిని అందరూ, ఎప్పుడుబడితే అప్పుడు వాడటం అంత మంచిది కాదు. ముఖ్యంగా డ్రైవింగ్‌ చేసేవాళ్లు వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

కఫం వస్తుంటే వైద్యుల సలహా మేరకే దగ్గు మందులు వాడాలి. దగ్గు విషయంలో మార్కెట్లో దొరికే సిరప్‌ల కంటే ఇంటి చిట్కాలే మేలు అంటున్నారు నిపుణులు. దగ్గుకు నీరు మంచి మందులా పనిచేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగితే  కఫం త్వరగా పల్చబడి బయటకు వెళ్లిపోతుంది. నీరు తాగటం వల్ల కఫాన్ని తేలిగ్గా తోడెయ్యవచ్చు. అలర్జీ కారణంగా దగ్గు వస్తున్నవాళ్లు చల్లగాలిలోకి వెళ్లకపోవటం, రోజూ ఆవిరి పట్టటం మంచిది. వారాల తరబడి కఫం-దగ్గు తగ్గకపోతే ఒక్కసారి కళ్ల పరీక్ష చేయించుకోవటం మంచిది.

దగ్గు తగ్గాలంటే చిట్కాలు

 

ధనియాలు, మిరియాలు మరియు అల్లాన్ని కషాయంగా చేసి తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగం బుగ్గన పెట్టుకున్నా దగ్గు తగ్గుతుంది.

 

రాత్రి పడుకునే ముందు చిటికెడు పసుపులో కాసిన్ని నీళ్లు కలిపి ఉండలా చేసి మింగి పడుకోవాలి. దీంతో దగ్గు తగ్గుతుంది.

 

మిరియాలపొడిలో కొంచెం తేనె కలిపి రోజూ తీసుకోవడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు. 

 

కాసిన్ని వాము గింజలను దవడకు పెట్టుకుని పడుకున్నా రాత్రి దగ్గు రాదు.

 

దగ్గుకి మంచి మందుగా క్యాబేజీ పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగినా దగ్గు మాయం అవుతుంది. క్యాబేజీ రసాన్ని నేరుగా తాగలేకపోతే చిటికెడు పంచదార కలుపుకోవచ్చు. తీవ్రతని బట్టి 2-3 సార్లు తీసుకోవచ్చు. దగ్గు ఎక్కువగా రాత్రిళ్ళు బాధిస్తుంది కాబట్టి పడుకోబోయే ముందు ఒకసారి తప్పకుండా తాగాలి.

 

రాత్రి పడుకునే ముందు ఒకటి లేదా రెండు చెంచాల తేనె తాగిస్తే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలుగుతుందని ఇజ్రాయెల్ అధ్యయనాల్లో తేలింది. విటమిన్ సి, ఫ్లావనాయిడ్ల నుండి ఉత్పత్తి అయిన యాంటీ ఆక్సిడెంట్లు తేనెలో దండిగా ఉంటాయి. శరీరంలో తీపిని నియంత్రించే నాడులకు దగ్గును నియంత్రించే నాడులకు దగ్గరి సంబంధం ఉండటంవల్ల తేనెలోని తియ్యదనం దగ్గును తగ్గించేందుకు తోడ్పడుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

 

దానిమ్మ రసంలో అల్లం రసం, తేనెను కలిపి మూడు పూటలు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.

 

రాత్రి పడుకునే ముందు బుగ్గన కరక్కాయ పెట్టుకుని పడుకున్నా దగ్గు రాదు.

 

సొంటి కషాయంలోగాని లేక అల్లం రసంలోగాని తేనె తీసుకుంటే దగ్గు, ఆయాసం, జలుబు, కఫం తగ్గుతాయి.

 

అడ్డ సరపాకుల రసంలో తేనె కలిపి రోజుకు 5 నుండి 10 మి.లీ. వరకు 3 లేక నాలుగు సార్లు తీసుకున్నా దగ్గు, ఆయాసం మటుమాయం అవుతుంది.

 

ఉమ్మెత్త ఆకులను ఎండబెట్టి చుట్టవలె చుట్టి దాని పొగతాగితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.

 

ఉసిరి పండ్లను పాలలో ఉడకబెట్టి ఎండించి పొడి చేసి దానిని 1/4గ్రా. నుండి 1/2గ్రా. మోతాదులో పుచ్చుకుంటే ఎలాంటి దగ్గయినా తగ్గుతుంది. పిప్పళ్ళను నీళ్ళతో మెత్తగా నూరి నువ్వుల నూనెలో వేయించి తీసి, పటిక కలిపి కషాయంతో కలిపి తీసుకుంటే కఫముతో కలిపి వస్తున్న దగ్గు తగ్గుతుంది.

 

పిప్పళ్లపొడి, బెల్లం సమ భాగాలుగా తీసుకుని సేవిస్తే దీర్ఘకాలంగా వున్న దగ్గులు, ఆయాసం తగ్గుతాయి.

 

ఒక కప్పు గోరువెచ్చటి నీళ్లలో సగం టీ స్పూన్ పసుపు, సగం టీ స్పూన్ ఉప్పు కలిపి, ఆ నీళ్లని పుక్కిలించి ఉమ్మేస్తే దగ్గు తగ్గుతుంది.

 

దాల్చిన చెక్కని పౌడర్‌ చేసుకుని అందులో కొద్దిగా తేనె వేసుకుని కలుపుకుని రోజూ తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి.