నేరస్థులా?...బాధితులా? మత్తు పానీయం, మత్తు మందు రెండూ ఒకటేనా ? - MicTv.in - Telugu News
mictv telugu

నేరస్థులా?…బాధితులా? మత్తు పానీయం, మత్తు మందు రెండూ ఒకటేనా ?

July 29, 2017

నేరస్థులా? బాధితులా? డ్రగ్స్ సరఫరా చేసారా? డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యారా? ఒకవేళ సరఫరా చేస్తే వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి? లేక డ్రగ్స్ కి అడిక్ట్ అయితే..వాళ్లకు సరియైన అవగాహన కలిపించి వాళ్లలో మార్పు ఎలా తీసుకురావాలి?ఈ అంశాలపై సర్కార్ కసరత్తు చేస్తుంది. మొగ్గలోనే తుంచేయాలనేది టిఆర్ ఎస్ సర్కార్ ప్లాన్ లాగా కనిపిస్తుంది.

డ్రగ్స్ వ్యవహారంలో దూకుడుగా పోవడం కంటే,ఆలోచనాతో కూడిన కార్యాచరణ అవసరమని కేసీఆర్ భావిస్తున్నట్టున్నారు.అందుకే నేరస్థులా? బాధితులా? అనే ప్రశ్నను కేసీఆర్ వదిలినట్టు కనిపిస్తుంది.మత్తు పానీయాలకు బానిసలైన వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉండేందుకు ఓ కార్యక్రమం ఉంది,కానీ అది అమలు కాదు అది వేరే విషయం.అయితే మత్తు మందులకు బానిసలైన వారి పట్ల కూడా అదే తరహాలో చికిత్స చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే కార్యాచరణను మాత్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది.

డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ సియం కేసీఆర్ మనోగతం కొంచెం అర్ధమైనట్టు కొంచెం అర్ధం కానట్టు ఉంది. డ్రగ్స్ కేసు నిమిత్తమై ప్రగతి భవన్ లో సిట్ అధికారులతో సమావేశమైన కేసీఆర్..డ్రగ్స్ కేసులో విచారిస్తున్న వారిని కేవలం బాధితులుగానే చూడాలని..వాళ్లు నేరస్థులు కాదని కేసీఆర్ తన అంతరంగాన్ని సిట్ అధికారులతో పంచుకున్నారు. డ్రగ్స్ తీసుకోవడం నేరమే,కానీ వాళ్లను భాదితులుగానే చూడాలనీ,డ్రగ్స్ సరఫరా చేసే వాళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదలద్దని కేసీఆర్ అధికారులకు చెప్పారట. అధికారులు కూడా విచారణలో బయపడిన అంశాలను కేసీఆర్ కు వివరించారట.

తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసిందని..అందుకే విచారణ పేరుతో డ్రగ్స్ కు సంబంధంలేని వారిని కూడా ఇబ్బంది పెడుతుందని కొందరు అభిప్రాయపడ్డారు.కానీ తెలంగాణ ప్రభుత్వం వ్యక్తులనో,వ్యవస్థనో టార్గెట్ చెయ్యడంలేదు,కేవలం డ్రగ్స్ మత్తుకు బానిస చేస్తున్న వారిని,డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న నిందితులను పట్టు కోవడంకోసమే ఈ విచారణలు.. అంతేగానీ ఎవ్వరినీ కావాలని ఉద్దేశ్య పూర్వకంగా టార్గెట్ చెయ్యలేదని మరో వైపు ప్రభుత్వం చెబుతుంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే.ఇది సున్నితమైన అంశంగా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే  ఇది సినిమావాళ్లకు సంబంధించిన అంశం కాదు.దీంట్లో విధ్యార్ధులు హైటెక్ సిటీలో పనిచేసే అనేక మంది ఉద్యోగులు ఈ డ్రగ్స్ బారిన పడ్డారు.డ్రగ్స్ వాడకంపై దెబ్బకొట్టడం అంటే అది పోలీసులతోనో ప్రభుత్వంతోనో అయ్యేపని కాదు.ఇది మానసికమైన రుగ్మత.దీన్ని రూపుమాపాలంటే మూలాల్లోంచి నరుక్కు రావాలి.బహుశా కేసీఆర్ ఆ పనికి కార్యాచరణను రూపొందిస్తున్నట్టున్నారు.