భార్యకు తనపై ప్రేమలేదని.. రోడ్డుమీద నిల్చున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

భార్యకు తనపై ప్రేమలేదని.. రోడ్డుమీద నిల్చున్నాడు..

March 15, 2019

మజాక్ మజాక్ రజాక్ ప్రాణాలకు వచ్చిందని ఓ సామెత వుంది. ఒకరికి మనపై ప్రేమ ఎంతుందో పరీక్ష చేయడానికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా ఎవరైనా ? తెలివి వున్నవారు ఎప్పుడూ అలాంటి  పని చెయ్యరు. కానీ ఓ ప్రేమికుడికి పిచ్చి పీక్‌కు చేరింది. తను కట్టుకున్న భార్యకు తనపై ప్రేమతగ్గిందని అనుకున్నాడు. అది టెస్ట్ చేద్దామని ట్రాఫిక్ వున్న రోడ్డు మీదకు ఎక్కాడు. ఆమె ఎంత వద్దని వారించినా వినకుండా రోడ్డు మీద నిలబడ్డాడు. అసలే చీకటి.. వాహనం వచ్చి ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో పడ్డాడు. చావు తప్పి కన్ను లొట్ట పడ్డట్టు అయింది అతని పరిస్థితి. సినిమా దృశ్యాన్ని తలపిస్తున్న ఈ ఘటన చైనాలోని బీజింగ్‌లో చోటు చేసుకుంది.

 

 

చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని లిషుయ్‌లో పాన్ అనే ఓ వ్యక్తి ఆరోజు బాగా తాగివచ్చాడు. తాగిన మత్తులో ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ కోపంలో నీకు నామీద ప్రేమ లేదని వాదించి బయటకు వచ్చాడు. తాను రోడ్డు మీద వున్నానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె వెంటనే రోడ్డుపైకి పరుగెత్తింది. అక్కడ రోడ్డు మీద కూడా ఇద్దరూ కాసేపటి వరకు వాదులాడుకున్నారు. ఆ తర్వాత వెళ్లి రోడ్డు మధ్యలో నిల్చున్నాడు. ఆమె వద్దని ఎంత చేయి పట్టి లాగినా వినకుండా మొండిపట్టుగా నిల్చున్నాడు. అసలే రాత్రి ఈయన తాగడం ఒకెత్తు అయితే వాహనాలు తోలేవాళ్లు కూడా తాగరని గ్యారెంటీ లేదు కదా. పైగా రాత్రి కావడంతో అందరూ రోడ్డు మీద స్పీడుగానే వుంటారు. ఈ క్రమంలో అతణ్ని రెండు మూడు వాహనాలు తప్పించుకుని పోయాయి. కానీ ఓ వాహనం స్పీడుగా ఇతనిమీదకు దూసుకువచ్చింది.

ఈ ప్రమాదంలో అతని తలకు, ఛాతీకి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఎందుకిలా చేశావని డాక్టర్లు అడిగితే ‘నిజంగా నా భార్యకు ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని రోడ్డుపై నిల్చున్నాను. చివరికి ఇలా అయింది’ అని చెప్పగానే ఆ డాక్లర్లకు ఎక్కడలేని కోపం వచ్చిందట అతని మీద. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సమీప సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో చూసి చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. నీ సైకో ప్రేమ తగలెయ్య.. బాగైంది నీకు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.