Drunk Punjab CM Bhagwant Mann offloaded in Frankfurt? AAP rejects claims
mictv telugu

‘సీఎం ఫుల్‌గా మందుకొట్టాడు, అందుకే విమానం నుంచి దించేశారు’

September 19, 2022

Drunk Punjab CM Bhagwant Mann offloaded in Frankfurt? AAP rejects claims

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై సంచలన కామెంట్స్ చేశారు శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్. మద్యం మత్తులో ఉన్న ఆయన్ను.. విమానం నుంచి దించేశారని ట్వీట్ చేశారు. మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్నారని, అందుకే విమానం నుంచి దించేశారని సుఖ్‌బీర్ సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని సీఎంతోపాటు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు చెప్పారంటూ ట్వీట్ చేశారు.

భగవంత్ మాన్ను విమానం నుంచి దించేయడం వల్ల విమానం 4 గంటలు ఆలస్యమైందన్నారు సుఖ్బీర్ సింగ్. ఫలితంగా ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోయారన్నారు. భగవంత్‌ మాన్‌ తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను సిగ్గుపడేలా చేసిందన్నారు. భారత ప్రభుత్వం ఈ విషయంపై జోక్యం చేసుకుని పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం మౌనం దాల్చిందని, అసలు ఏం జరిగిందో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంగా చెప్పాలన్నారు.

ఇటీవల 8 రోజుల జర్మనీ పర్యటనకు వెళ్లారు పంజాబ్ సీఎం. ఆదివారం భారత్కు తిరిగొచ్చారు. అయితే.. ఆయన ప్రయాణించిన విమానం రాక ఆలస్యం కాగా.. ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వీటిని ఆమ్ఆద్మీ పార్టీ ఖండించింది .