తండ్రి తాగుడు మానాలని కూతురు బలైపోయింది! - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి తాగుడు మానాలని కూతురు బలైపోయింది!

February 3, 2018

మద్యపానంతో ఆరోగ్యాలే కాదు కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. ఇంటి ఖర్చుకు, పిల్లల చదువుసంధ్యలకు వాడాల్సిన డబ్బును తాగుబోతులు వైన్‌షాపుల పాలు చేస్తున్నారు. తన తండ్రితో తాగుడు మాన్పించాలని ఓ కూతురు బలవన్మరణానికి పాల్పడింది. తిరుపతి రూరల్ మండలం రజక కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది.సరస్వతి,  శ్రీనివాస్ దంపతుల కూతురైన భార్గవి హైస్కూల్లో చదువుకుంటోంది. సరస్వతి స్విమ్స్ ఆస్పత్రిలో స్వీపర్‌కాగా,  శ్రీనివాస్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ తాగుడుకు బానిస. తను సంపాదించిన డబ్బుతోపాటు భార్య సంపాదనను కూడ మందుకు తగలేసేవాడు.. భార్గవికి ఇది నచ్చేది కాదు. తాగుడు మానాలని చాలాసార్లు తండ్రిని బతిమాలింది. అయినా అతడు వినిపించుకోలేదు.

తండ్రి తాగడం మరింత ఎక్కువ కావడంతో ఇటీవల.. ‘నువ్వు మందు మానేస్తావా లేకపోతే నన్ను చావమంటావా?’ అని ఎలుకల మందు చేతిలో పట్టుకుని హెచ్చరించింది. అంతకుముందే ఆ మందును కాస్త నోటిలో వేసుకుంది. ఆ ప్రభావంతో తను కిందపడితే తండ్రి భయపడి తాగుడు మానేస్తాడని అనుకుంది. అయితే ఎలుకలమందు అప్పటికే భార్గవిపై ప్రభావం చూపింది. అపస్మారకంలోకి వెళ్లిపోయిన ఆమెను స్విమ్స్ కు తరలించారు. మూడు రోజులు చావుబతుకుల మధ్య కొట్లాడిన భార్గవి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది.