తాగి నిజం చెప్పాడు.. జైల్లో పడ్డాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

తాగి నిజం చెప్పాడు.. జైల్లో పడ్డాడు..!

March 30, 2018

తాగితే మనసులో ఉన్నది ఉన్నట్టు కక్కేస్తారు. నిజాయతీగా, బోళాగా మాట్లేడేసుకుంటారు. దీంతో తర్వాత చాలా సమస్యలు వస్తాయి. ఓ తాగుబోతు మైకంలో నిజం చెప్పేసి కటకటాల వెనక్కి వెళ్లాడు. అతడు చేసింది మామూలు నేరం కాదు. దారుణ హత్య! భద్రాద్రి కొత్తగూడె జిల్లా సారపాక సారపాక పంచాయతీలోని శ్రీరాంపురం కాలనీకి చెందిన కొర్స రమేశ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

రమేశ్ అదే గ్రామానికి చెందిన కృష్ణమూర్తి నుంచి రూ. 3వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించలేదు. దీనిపై డిసెంబర్‌లో కృష్ణమూర్తి గొడవ పడ్డాడు. అప్పుడు రమేష్‌ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. డబ్బులు ఇస్తానంటూ కృష్ణమూర్తిని శ్రీరాంపురం దగ్గర్లోని అడవిలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. బోరుపనులు చేసే కృష్ణమూర్తికి పెళ్లికాలేదు. అతడు బోరు పనికోసం వేరే వూర్లో ఉన్నాడేమో అని బంధువులు అనుకున్నారు.

ముత్తయ్య కూడా అడిగాడు..

గ్రామానికి చెందిన  ముత్తయ్య అనే వ్యక్తి నుంచి కూడా రమేశ్ అప్పు తీసుకున్నాడు. ఎప్పుడు తీరుస్తావని ముత్తయ్య గతవారం నిలదీశాడు. మద్యం మత్తులో ఉన్న రమేష్‌కు కోపం, నిజాయతీ ఒకేసారి తన్నుకొచ్చాయి. ‘పైసల్, పైసల్ అని పీడిస్తే ఆ కృష్ణమూర్తిగాడికి పట్టిన గతే నీకూ పడుతుంది..’ అని హెచ్చరించాడు. ముత్తయ్యకు మొదట అర్థం కాలేదు. తర్వాత రమేష్.. కృష్ణమూర్తిని ఏమైనా చేసి ఉంటాడనే అనుమానం వచ్చి, పోలీసులకు ఉప్పందించాడు. పోలీసులు విచారణలో రమేశ్.. కృష్ణమూర్తిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. హత్యస్థలానికి తీసుకెళ్లాడు. కృష్ణమూర్తి అస్థిపంజరం మాత్రమే అక్కడ కనిపించింది.