బీరు బాటిళ్లు, ఇటుక రాళ్లతో హాస్పిటల్‌పై తాగుబోతుల దాడి
హాస్పిటల్ సమీపంలో మద్యం సేవించొద్దని చెప్పినందుకు తాగుబోతుల గ్యాంగ్ హాస్పిటల్ పై దాడి చేసింది. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేపీహెచ్బీ లోని రోడ్ నంబర్ 2 లోని ఎస్ ఎస్ ఆర్ హాస్పిటల్ వద్ద గల ఖాళీ స్థలంలో మందుబాబులు నిత్యం మద్యం సేవిస్తుంటారు. నిన్న(బుధవారం) రాత్రి కూడా కొంతమంది యువకులు హాస్పిటల్ సమీపంలో మద్యం సేవిస్తుండగా హాస్పిటల్ లో డ్యూటీలో ఉన్న సిబ్బంది మందలించారు. వారిని అక్కడ నుండి వెళ్లిపోవాల్సిందిగా సెక్యూరిటీ గార్డ్, నర్సు సూచించారు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు.. బీర్ బాటిళ్లు, రాళ్లతో హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్, నర్సు పై దాడి చేశారు. ఈ ఘటనలో వారి తల, చేతులపై గాయాలయ్యాయి. హాస్పిటల్ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే మందు బాబులు.. హాస్పిటల్ సమీపంలో వద్దని చెప్పినా వినలేదు. వీడియో తీస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించగా.. కావాలంటే సెల్ఫీలు తీసుకోండి.. కోపరేట్ చేస్తామంటూ దురుసుగా ప్రవర్తించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తమపై దాడి చేసినట్లు హాస్పిటల్ లో పనిచేస్తున్న నర్సు కృష్ణవేణి తెలిపారు. హాస్పిటల్ అద్దాలు పగులకొట్టారని, తమ సెక్యూరిటీ గార్డుపై బీరు బాటిళ్లతో తల పగులకొట్టినట్లు చెప్పారు.