'ఈడ వద్దు.. ఆడ వద్దు.. మరెక్కడ తాగాలో మీరే చెప్పండి' - Telugu News - Mic tv
mictv telugu

‘ఈడ వద్దు.. ఆడ వద్దు.. మరెక్కడ తాగాలో మీరే చెప్పండి’

February 15, 2023

SI

 

కాయకష్టం చేసుకుని నాలుగు డబ్బులు చేతిలో పడ్డాక.. ఒళ్లునొప్పులు తెలియకుండా ఆ సాయంత్రం మద్యం తాగి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు కొందరు. అయితే ఇటీవల మద్యం దుకాణం వద్ద మద్యం తాగరాదని నిబంధనలున్నాయి. అంతేకాదు ఆ పరిసర ప్రాంతాల్లోని ఇతర దుకాణాల వద్ద కూడా తాగకూడదు. అందుకు ప్రధాన కారణం తోటివారితోపాటు, మిగతా ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఈ రూల్స్ పెట్టారు. కానీ ఈ రూల్స్‌తో ఎక్కడ తాగాలో అర్థం కావట్లేదని, వేరే చోటెక్కడ అని పోలీసులనే ప్రశ్నిస్తున్నారు మందుబాబులు.

ఏపీలోని తిరుపతి వాకాడులో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వాకాడులోని అశోకస్తంభం వద్ద ఓ వైన్ షాప్ ఉంది. అక్కడ మద్యం కొనుగోలు చేసిన కొందరు మందుబాబులు సమీపంలోని కూల్ డ్రింక్స్ షాపుల దగ్గర, చర్చికి వెళ్లే దారిలో తాగుతూ కనిపించారు. ఇది కొందరు బాటసారులు ఇబ్బందికరంగా మారింది. వారితో ఎదురవుతున్న ఇబ్బందులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఎస్సై రఘునాథ్ స్పాట్‌కు వచ్చారు.

వారిని ఎస్సై ప్రశ్నించగా.. మద్యం దుకాణం వద్ద మద్యం తాగరాదని అంటున్నారు. దీనికి దగ్గరలోని ఇతర దుకాణాల దగ్గరా తాగొద్దంటున్నారు. ఇంటికి పోతే మా భార్యలు ఇంట్లో తాగేదే లేదని తెగేసి చెబుతున్నారు. మరి.. ఈ కొన్న మందును ఎక్కడ తాగాలో మీరే చెప్పండి సారూ అంటూ ఎస్సై చుట్టూచేరి ఆందోళన చేశారు. తమకు సమాధానం చెప్పాలని అడిగారు. మర్యాదగా అక్కడినుంచి వెళ్లకపోతే కేసులు నమోదు చేస్తామని ఎస్సై గట్టి వార్నింగ్ ఇవ్వడంతో దెబ్బకు అంతా జారుకున్నారు.