పెళ్లి అవుతుందంటే చాలు బ్యాచిలర్ పార్టీలని ఫ్రెండ్స్‌తో చిల్ అవుతుంటారు పెళ్లికొడుకులు. పెళ్లి అవుతుందన్న ఖుషీలో మునిగితేలుతుంటారు. పెళ్లి సమయానికి కళ్లా ఫుల్ జోష్‌లో ఉండాలని చాలా మంది పెళ్లికొడుకులు లిమిట్కి మించి మద్యం సేవించరు. కంట్రోల్ తప్పి వ్యవహరించరు. ఇక కొంతమందైతే మండపానికే ఫుల్‌గా తాగి వచ్చి వీరంగా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యన నార్త్‌లో చాలా కామన్ అయిపోయాయి. కానీ బీహార్‌లో మాత్రం ఓ పెళ్లి కొడుకు చేసిన పనికి పెళ్లి పంచాయితీ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పెళ్లి కొడుకు వ్యవహారం నచ్చని వధువు విసుగెత్తి ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగింది. ఈ పెళ్లి కొడుకు చేసిన పనేంటో వివరాలు ఇప్పుడు చూద్దాం.
బీహార్‌లోని భాగల్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సుల్తాన్‌గంజ్ ప్రాంతానికి చెందిన యువతితో మియాన్ అనే యువకుడితో వివాహం నిశ్చయం అయ్యింది. సోమవారం రాత్రి పెళ్లి ముహూర్తాన్ని పెద్దలు ఫిక్స్ చేశారు. చుట్టాలందరినీ పిలుచుకున్నారు. వధువు తరపున వారు పెళ్లికి భారీ ఏర్పాట్లు చేశారు. వధువు, వరుడి తరపు నుంచి వచ్చిన చుట్టపక్కాలు, బంధుమిత్రులతో పెళ్లి మండపమంతా వెలిగిపోయింది. ముహూర్తం దగ్గరపడటంతో మండపంలో పెళ్లి కూతురు సిగ్గుపడుతూ వరుడి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అయితే సమయం మించిపోతున్నా వరుడు మండపానికి చేరుకోలేదు. దీంతో ఏమయ్యిందోనని మొదట అందరూ ఆందోళన చెందారు. అయితే అసలు విషయం తెలుసుకుని అందరూ అవాకయ్యారు. మద్యం మత్తులో మునిగిపోయిన వరుడు అసలు తనకు పెళ్లన్న విషయాన్నే మరిచిపోయాడు. ఈ విషయం తెలుసుకుని విసుగెత్తిపోయిన వధువు కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వధువు పెళ్లిని రద్దు చేసుకుంది.
పెళ్లి అవుతుందన్న ఖుషీలో రాత్రంతా ఫుల్లుగా మద్యం మత్తులో మినిగిపోయాడు వరుడు. మత్తులో తానేం చేస్తున్నాడో పూర్తిగా మరిచిపోయాడు. మిగితా విషయాలు పక్కన పెడితే అసలు తన పెళ్లికి వెళ్లడమే మరిచిపోయాడు. తెల్లారాక పెళ్లి విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే వధువు ఇంటికి వెళ్లిపోయాడు. ఎంత బతిమిలాడినా పెళ్లికి వధువు నిరాకరించింది. పైగా వరుడిని బంధించి పెళ్లికి అయిన ఖర్చులు ఇవ్వాలని వధువు తరపు వారు డిమాండ్ చేశారు. దీంతో ఈ పెళ్లి పంచాయితీ కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రెండు కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు.