పోలీసు ఉన్నతాధికారులు సెలవు దొరికినప్పుడు ఫ్యామిలీతో టైం స్పెంట్ చేయడం, కారులో షికారుకు వెళ్లడం తప్పు కాదు కానీ.. సీజ్ చేసిన కారుకు, నంబర్ ప్లేట్ మార్చి మరీ అందులో తిరగడం కచ్చితంగా తప్పే. ప్రభుత్వం వారు ఇచ్చిన వాహన సదుపాయాన్ని కాదని.. ఓ కేసులో సీజ్ చేసిన కారుని, చాలా రోజులుగా ‘లగ్జరీయస్’గా తన సొంతానికి వాడుకుంటున్నాడో డీఎస్పీ. అయితే షికారుకు వెళ్లిన ఆ కారును మరో వాహనం ఢీకొనడంతో అసలు విషయం బయటకు వచ్చింది. లేదంటే ఈ సంగతికి డిపార్ట్‌మెంట్‌కి ఇప్పటికీ తెలిసేది కాదు.
అలా మొదలైంది..
ఏపీలోని అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో 2022 జులైలో కారులో గంజాయి తరలిస్తున్న ఓ ముఠా.. మార్గమధ్యలో పోలీసులు కనిపించడంతో భయపడి కారును వదిలేసి పారిపోయారు. కశింకోట పోలీసులు ఆ కారు (ఏపీ31 బీఎన్1116)ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ కారు జి.మాడుగులకు చెందిన సుల్తాన్ అజారుద్దీన్ పేరుతో రిజిస్టరై ఉంది. అజారుద్దీన్‌తో మొదలైన విచారణ చివరకు కూపీ లాగగా… రాజస్థాన్‌కు చెందిన సింగ్ అనే వ్యక్తి జి.మాడుగులలోనే ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో గతేడాది నవంబరు 11న అతడు కశింకోట స్టేషన్‌కు మరో కారులో వచ్చాడు. విచారించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడు తాను వేసుకువచ్చిన కారును తన తల్లికి అప్పగించాలని కోరాడు. అయితే ఆమె రాజస్థాన్ వెళ్లిపోయారని తెలిసి ఆ కారును అనకాపల్లి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు.
నంబర్ ప్లేట్ మార్చి..
అప్పటి నుంచి పోలీసులు ఆ కారుకు నంబర్ ప్లేట్(సీజ్ చేసిన కారుది) మార్చి తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 1న డీఎస్పీ సునీల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆ కారు తీసుకుని విశాఖపట్నం వెళ్లారు. బీచ్ రోడ్డులో ఆయన ఓ వాహనాన్ని ఢీకొట్టగా.. అక్కడున్న వారు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ యవ్వారమంతా బయటపడింది. అయితే దొంగకు తేలు కుడితే ఎలా గమ్మున ఉంటాడో అదే పరిస్థితి డీఎస్పీది కూడా. తీసుకొచ్చిన కారు తనది కాదు, పైగా గంజాయి కేసులో నిందితుడి కారు. గట్టిగా నోరు తెరిస్తే తనకే ప్రమాదం. కాబట్టి ప్రమాదంపై డీఎస్పీ, అవతలి వ్యక్తితో కాంప్రమైజ్ అయ్యాడు. దీంతో కేసు నమోదు కాలేదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇదంతా తెగ వైరల్ అయింది.
నేను హాస్పిటల్‌కి వెళ్లాలంటే..
మరోవైపు డీఎస్పీ వ్యవహారంపై అనకాపల్లి ఎస్పీ గౌతమిని వివరణ కోరగా.. డీఎస్పీ సునీల్ గంజాయితో పట్టుబడిన నిందితుడు సింగ్ కారులో ప్రయాణించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిందితుడి కారును సొంతానికి వాడుకోవడం ఒక నేరమైతే.. నంబరు ప్లేట్ మార్చడం మరో నేరం అని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించామని చెప్పారు. కానీ సునీల్ మాత్రం.. ‘తాను అర్జంట్ గా హాస్పిటల్‌కి వెళ్లాలంటే పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఆ కారును పంపారని’ చెబుతున్నాడు. నంబరు ప్లేట్ మార్చిన విషయం తనకు తెలీదన్నాడు.