పొట్టకూటికి వెళ్లిన భారతీయుడు 8 కోట్లు గెలిచాడు. - MicTv.in - Telugu News
mictv telugu

పొట్టకూటికి వెళ్లిన భారతీయుడు 8 కోట్లు గెలిచాడు.

June 23, 2022

బతుకుదెరువు కోసం 35 ఏండ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లి స్థిరపడ్డ ఓ భారతీయుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఆ దేశంలో నిర్వహించిన ఓ లాటరీలో రూ.7.82 కోట్లు గెలుచుకున్నాడు. పూర్తి వివరాలిలా… కేరళ రాష్ట్రానికి చెందిన జాన్ వర్ఘీస్ 35 ఏళ్ల నుంచి అరబ్ దేశాల్లోనే ఉంటున్నాడు. ఒమన్‌లో నివాసముంటున్న వర్ఘీస్.. ప్రస్తుతం మస్కట్‌లోని పాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (FMCG) అనే కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.

తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వర్ఘీస్ గత ఆరేళ్ల నుంచి క్రమం తప్పకుండా రాఫెల్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. ఎప్పటిలాగే.. గత నెల మే 29న మిలీనియం మిలియనీర్ సిరీస్ నం. 392లో భాగంగా అతడు ఆన్‌లైన్ ద్వారా లాటరీ టికెట్ నం. 09827 కొనుగోలు చేశాడు. బుధవారం(జూన్ 22 న) దుబాయ్ ఎయిర్ పోర్టులో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో వర్ఘీస్ ఏకంగా 1 మిలియన్ డాలర్లు(రూ.7.82కోట్లు) గెలుచుకున్నాడు. అతడు కొనుగోలు చేసిన టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది.
ఒక మిలియన్ డాలర్లు గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. కలలో కూడా ఇంత భారీ మొత్తం గెలుస్తానని అనుకోలేదని వర్ఘీస్ పేర్కొన్నాడు. ఈ నగదులో కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మరికొంత భాగాన్ని తన భవిష్యత్ ప్రణాళికకు ఉపయోగిస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే కొంత మొత్తాన్ని చారిటీకి వినియోగిస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా లాటరీ నిర్వాహకులకు వర్ఘీస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు.