కొడుకు పుట్టినరోజు కోటీశ్వరుణ్ని చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకు పుట్టినరోజు కోటీశ్వరుణ్ని చేసింది

May 10, 2022

బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఆ భారతీయుడిని అదృష్టం వరించింది. కొడుకు పుట్టిన రోజు అతణ్ని కోటీశ్వరుణ్ని చేసింది. తమిళనాడులోని మధురైకి చెందిన దక్షిణామూర్తి మీనాచిసుందరం(29) అనే వ్యక్తి గత 9 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. భార్యాపిల్లలను ఇండియాలోనే ఉంచి.. దుబాయ్‌లోని ఓ కనస్ట్రక్షన్ కంపెనీలో నెలకు 2,500 దిర్హమ్స్(రూ.52వేలు) జీతంతో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా అబుదాబి బిగ్‌టికెట్‌ రాఫెల్‌లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న దక్షిణామూర్తి .. ఇటీవల తన కుమారుడి పుట్టిన తేదీ కలిసొచ్చేలా ఓ లాటరీ టికెట్ కొన్నాడు.

మే 2వ తేదీన తన కొడుకు పుట్టిన తేది 24-05-2021 కలిసొచ్చేలా లాటరీ టికెట్‌(నం. 065245)లోని చివరి మూడు నెంబర్లు 245ఉన్న టికెట్ కొన్నాడు. అదృష్టవశాత్తు అబుదాబిలో నిర్వహించిన వీక్లీ ఎలక్ట్రానిక్ డ్రాలో అతడు కొనుగోలు చేసిన టికెట్ నంబర్‌కే లాటరీ తగిలింది. దాంతో ఏకంగా 5లక్షల దిర్హమ్స్(భారత కరెన్సీలో సుమారు రూ. 1.05కోట్లు) గెలుచుకున్నాడు. ఇలా కొడుకు బర్త్‌డే దక్షిణమూర్తికి అదృష్టాన్ని తెచ్చిపెట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా అవతరించారు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. గెలిచిన ఈ భారీ మొత్తంతో తన జీవితమే మారిపోతుందని, వెంటనే ఊరు నుంచి తన భార్య, కుమారుడిని యూఏఈకి తెచ్చుకుంటానని తెలిపాడు.