Dubai restaurant customers made Rs 1.39 Cr bill on new year event
mictv telugu

18 మంది న్యూఇయర్ బిల్లు ఎంతో తెలిస్తే.. కళ్లు తిరుగుతయ్..

January 4, 2023

న్యూ ఇయర్ వేడుకల్లో దుమ్మురేపి భారీగా ఖర్చు చేయడం మామూలే. ఫుడ్, మందు, చిందు.. ఏవి వీలైతే అవి అన్నీ లాగించి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సంపన్న దేశాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. గల్ఫ్ దేశాల్లో ఇటీవల న్యూ ఇయర్ వేడుకల్లో కుబేరులు మరింత రెచ్చిపోతున్నారు. 2023కు ఆహ్వానం పలుకుతూ ఓ బ్యాచ్ చేసిన బిల్లే దీనికి ఉదాహరణ. దుబాయ్‌లోని ఇంద్రలోకం లాంటి గాల్ రెస్టారెంటుకు వెళ్లిన 18 మంది ఫుడ్, డ్రింక్స్ కోసం ఏకంగా రూ. 1.39 కోట్లు ఖర్చుపెట్టారు. దిర్హామ్‌లలో ఈ మొత్తం 6,20,926. ఈ బిల్లును రెస్టారెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. న్యూ ఇయర్ పార్టీ చేసుకోవడానికి వచ్చిన 18 మంది ఒక బ్యాచ్‌గా కూర్చుని అత్యంత ఖరీదైన వెజ్, నాన్‌వెజ్, డ్రింక్స్ పుచ్చుకున్నట్లు రెస్టారెంట్ యజమాని మెర్క్ తుర్క్‌మెన్ తెలిపారు. ‘మొదటిది కాదు, చివరిది కాదు’ అని చెప్పాడు. ఈ బ్యాచ్ లాగించిన తిండిలో కాక్‌టెయిల్, యాపిల్ జ్యూస్, గ్రీన్ టీ, కోకాకోలా వంటి డ్రింక్స్ వంటివి ఉన్నాయి.

ఇలాంటి బ్యాచే ఇంకొకటి…
ఇటీవల అబుధాబిలోని నస్రత్ రెస్టారెంటులోనూ ఇలాంటి భారీ బిల్లు చేశారు. 14 మంది ఏకంగా 1.30 కోట్లు తిండి, డ్రింక్స్ లాగాంచారు. మాంసం, చికెన్, రొయ్యలు, నాన్ వంటివన్నీ మెనూలో ఉన్నాయి. ఖరీదైన నూనెలు, మసాలాలు దట్టించి వండారు. మటన్ స్టీక్స్‌కు 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ఫాయిల్ కలిపి వడ్డించారు. నంజుకోవడానికి మరెన్నో ఖరీదైన ఐటమ్స్. అందుకే బిల్లు వాచిపోయింది.