తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి. 81 శాతంపైగా పోలింగ్ నమోదైంది. అటు పోలింగ్ ముగియగానే ఇటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటికొస్తున్నాయి. ఒక్కో సర్వే ఒక్కో ఫలితం చెబుతోంది. కాంగ్రెస్ విషయంలో మాత్రం ఒకే ఫలితం వచ్చింది. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతా రెడ్డి గెలుస్తుందని థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ తెలిపింది. ఆమెకు 51.54 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 33.36 శాతం దక్కించుకుంటారని, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి 8.11 శాతం ఓట్లతో మూడోస్థానంలో ఉంటారని థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ చెప్పింది. అయితే విజయం బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావుదేనని పొలిటికల్ ల్యాబొరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఆయనకు 47 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొంది. టీఆర్ఎస్కు 38 శాతం, కాంగ్రెస్కు 13 శాతం ఓట్లు వచ్చాయంది. కాగా, ఎన్నికల కమిషన్ ఈ నెల 10న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనుంది.