సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబరు 9న వెల్లడించనున్నారు. అక్టోబరు 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. 17న నామినేషన్ల పరిశీలన, 19వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా పేర్కొంది. అన్ని పూర్తైన తర్వాత నవంబర్ 10వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. దీంతో అక్కడ అసెంబ్లీ స్థానం ఖాళీ ఏర్పడింది. బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి ఉప ఎన్నిక రావడంతో విజయం కోసం పోటీ పడుతున్నారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు పోటా పోటీగా పావులు కదుపుతున్నారు.