ఉప ఎన్నిక నేపథ్యంలో దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. ప్రచారానికి మరికొన్ని రోజులే మిగిలి ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు రాత్రనకా.. పగలనకా ప్రచారం చేస్తున్నారు. అలాగే పోలీసులు అభ్యర్థుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల శామీర్పేట్లో పట్టుబడ్డ 40లక్షల రూపాయలు.. బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు చెందినవిగా తేలిన సంగతి తెల్సిందే. తాజాగా పోలీసులు సిద్దిపేటలోని రఘునందన్ రావు అత్తారిల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మొత్తం 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ విషయం తెలియడంతో ఆయన హుటాహుటిన సిద్దిపేటకు చేరుకున్నారు.
ఇంట్లోకి వెళ్లడానికి ఆయన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆయన తనిఖీల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని పోలీసులను డిమాండ్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో రఘునందన్ ఇంటి ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తనిఖీల్లో భాగంగా ఆ ఇంట్లో ఉన్న రూ. 18.67 లక్షలను పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. 10వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు.