దుబ్బాకలో బీజేపీకి షాక్.. పార్టీ మారిన కీలక నేత - Telugu News - Mic tv
mictv telugu

దుబ్బాకలో బీజేపీకి షాక్.. పార్టీ మారిన కీలక నేత

November 11, 2022

దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఎదురు దెబ్బ తగిలింది. దుబ్బాక మండల బీజేపీ అధ్యక్షుడు అరిగే కృష్ణను గులాబీ పార్టీ తనలో చేర్చుకుంది. మంత్రి హరీష్ రావు, స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. గత కొంతకాలంగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న అరిగే కృష్ణది కూడా రఘునందన్ రావు సొంతూరు బొప్పాపూర్ అని తెలుస్తోంది. స్థానిక క్యాడర్ తో మంచి సంబంధాలు ఉన్న ఆయన పార్టీ మారడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

పార్టీ మారిన అరిగే కృష్ణ రఘునందన్ రావును విమర్శిస్తూ మాట్లాడారు. ఆయన వల్ల దుబ్బాకకు ఒరిగిందేమీ లేదని, ప్రజలు, కార్యకర్తలకు నిరాశే మిగిలిందని ఆరోపించారు. అధికార పార్టీలో చేరడం ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పటి నుంచో దుబ్బాకలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. కానీ, చివరి నిమిషంలో టిక్కెట్ రాకపోవడంతో మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈ సారి ఎలాగైనా దుబ్బాక నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారంట. దీంతో ఎలాగైనా గెలవాలని ఆయన నియోజకవర్గాన్ని ఇప్పటినుంచే చుట్టేస్తున్నారంట. రఘునందన్ రావుకు చెక్ పెట్టాలంటే ప్రభాకర్ రెడ్డినే కరెక్ట్ అని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది.