అగ్రరాజ్యం అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిచిపోయాయి. దీనికి ఏర్పడిన భారీ సాంకేతిక లోపమే కారణమని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. దీంతో 400 విమానాలు షెడ్డుకే పరిమితమయ్యాయని తెలిపింది. విమానాలు తిరిగే రూట్లలో మార్పులు, చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి విమాన సిబ్బందికి అలర్ట్ జారీ చేసేందుకు ఉన్న వ్యవస్థ నోటీస్ టు ఎయిర్ మిషన్స్ లో సాంకేతిక సమస్య తలెత్తిందని పేర్కొంది. దీన్ని పునరుద్ధరించేదుకు యత్నిస్తున్నామని, అయితే ఎంత సమయం పడుతుందో చెప్పలేమని స్పష్టం చేసింది. ఈ సమస్య కారణంగా నేషనల్ ఎయిర్ స్పేస్ వ్యవస్థ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడిందని వివరించింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయానికి 400 విమానాలు రద్దై, 760కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయంది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు. గంటల తరబడి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తున్నామని, అధికారుల నుంచి ఎలాంటి ఊరట కలిగించే సమాచారం లేదని మండిపడుతున్నారు.