ఇంగ్లీష్ రాకే ఇంటర్ ఫెయిలయ్యా.. పవన్ కల్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇంగ్లీష్ రాకే ఇంటర్ ఫెయిలయ్యా.. పవన్ కల్యాణ్

December 12, 2019

Pawan

ఇంగ్లీష్‌ బాగా రాకే ఇంటర్‌ ఫెయిల్ అయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఇంగ్లీష్‌ మీడియం పెడితే ఓకే.. కానీ తెలుగు గురించి కూడా ఆలోచించాలని పవన్‌ అన్నారు. రైతు సమస్యలపై పవన్ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహనమే జనసేన బలమని, బలహీనత కాదని స్పష్టంచేశారు. భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. ఓటమి వల్ల తన ఆత్మస్థైర్యం దెబ్బతినలేదని చెప్పారు. 

రైతు కన్నీరు ఆగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ‘రైతుల దగ్గర ధాన్యం కొని రశీదులు ఇవ్వలేదు. కొన్న ధాన్యానికి ఇంతవరకు డబ్బు చెల్లించలేదు. అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించాలి. ధాన్యానికి బస్తాకు రూ.1300 కాదు.. రూ.1500 ఇవ్వాలి. రూ.1500 ఇస్తే చేసిన తప్పుకు క్షమాపణ చెప్పినట్టు అవుతుంది. మీకు కులం పట్టింపు లేకపోతే… కౌలు రైతులను కులం ఎందుకు అడుగుతున్నారు?’ అని పవన్ ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంటి రిపేర్‌ కోసం రూ.9కోట్లు బిల్లు పెట్టారని ఆరోపించారు. 

ఇదిలావుండగా ఇంగ్లీష్ మీడియం బోధన అంశంలో పవన్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక విబేధించిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ అన్న చిరంజీవి కూడా పవన్‌కు షాక్ ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం గురించి ముఖ్యమంత్రి జగన్‌ను అభినందిస్తూ ప్రకటన విడుదల చేశారు.