Dumka Girl Set Ablaze Incident: KTR Demands IPC, Juvenile Justice Act Amendment
mictv telugu

యువతిని తగులబెట్టి.. నవ్వుతూ పోలీస్ జీప్ ఎక్కి.. మంత్రి కేటీఆర్ ఫైర్

August 30, 2022

తన ప్రేమను నిరాకరించిన యువతిని పెట్రోలు పోసి తగలబెట్టిన యువకుడు పోలీసులకు చిక్కి నవ్వుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఏదో ఘనకార్యం చేసినట్టు ఆ నవ్వులేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఝార్ఖండ్ లోని దమ్కాలో.. తన ప్రేమను అంగీకరించలేదన్న కసితో 12 ఏళ్ల బాలికపై షారుక్ హుస్సేన్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆగస్టు 23వ తేదీ వేకువజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాలిన గాయాలతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి అంకిత మరణించింది. ఈ విషయం బయటకు తెలియడం వల్ల దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు షారూక్‌తోపాటు అతడికి పెట్రోలు అందించిన మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత షారూక్ చేతులకు బేడీలు వేసిన పోలీసులు వాహనం వద్దకు తీసుకెళ్తున్న సమయంలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్రిస్తున్నప్పుడు బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. అమాయకురాలి నిండు జీవితాన్ని బలితీసుకున్న దుర్మార్గుడు షారుఖ్ కు ఈ సమాజంలో బతికే హక్కు లేదని ట్వీట్ చేశారు. ఆ నిందితుడి ముఖంలో తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఏ మాత్రం కనిపించడం లేదని అన్నారు.

ఐపీసీ, క్రిమిన‌ల్ ప్రోసిజ‌ర్ కోడ్‌, జువైన‌ల్ చ‌ట్టాల‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇలాంటి నిందితుల‌కు క‌ఠిన‌మైన శిక్ష‌ల‌ను విధించాల‌ని ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిందితులు బ‌య‌ట‌కు రాకుండా చూడాల‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండాలంటే బ‌ల‌మైన చ‌ట్టాలు అవ‌స‌రం అని కేటీఆర్ పేర్కొన్నారు.