పెళ్లి కాకుండానే పండంటి మగబిడ్డను కన్న కుంతీదేవి లోకనిందకు భయపడి బిడ్డను అందమైన పేటికలో ఉంచి నదిలో వదిలేస్తుంది. ఆ పెట్టె తేలుతూ పోయి గుర్రాల సంరక్షకుడికి దొరుకుతుంది. ఆ పిల్లాడు కర్ణుడిగా మారి శౌర్యానికి, దానధర్మాలకు మారుపేరుగా నిలుస్తాడు. ఈ కథ అందరికీ తెలిసిందే. కానీ అందరికీ ఆ అవకాశం ఉండదు. లోకానికి భయపడిన తల్లులు వదిలించుకున్న బిడ్డలు గుక్కపట్టి ఏడ్చి చనిపోతుంటారు. కొందర్ని ఎవరో పుణ్యాత్ములు కాపాడతారు. ఉత్తరప్రదేశ్‌లో ఏ అభాగ్యురాలో వదిలించుకున్న పురిటిబిడ్డను ప్రకృతే కాపాడింది! బిడ్డను ఆ తల్లి చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కపై ఉంచడం వల్ల ప్రాణాపాయం తప్పింది. చిన్నారి తల సరిగ్గా గుర్రపుడెక్కపై ఉండడంతో మునగలేదు. కాళ్లు మాత్రం నీటిలో ఉన్నాయి. తల్లి గుర్రపుడెక్కపైనే ఉంచి ఉంటుందని, పాప కదడం వల్ల కాళ్లు నీటిలోకి జారి ఉంటాయని భావిస్తున్నారు. బదాయూ జిల్లా ఖతావూ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వకీల్ అహ్మద్ అనే రైతు పొలానికి వెళ్తుండగా చెరువు నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా గుర్రపుడెక్కపై పాప కనిపించింది. వెంటనే బయటికి తెచ్చి అధికారులకు అప్పగించారు. పాపను ప్రస్తుతం నవాబ్‌గంజ్ ఆస్పత్రిలో చేర్చి సంరక్షిస్తున్నారు. కాగా, బదాయూలోనే వారం కిందట ఓ పాడుబడ్డ బావిలో ఆడశిశులు కనిపించింది. ఇరవై అడుగుల లోతున్న ఎండిన బావి నుంచి ఏడుపు వినిపించడంతో స్థానికులు కాపాడారు.