నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు.. రైతులురా, పాపంరా.. - MicTv.in - Telugu News
mictv telugu

నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు.. రైతులురా, పాపంరా..

June 5, 2020

Nirmal District.

దేశానికి అన్నం పెడుతూ వెన్నుముకలా ఉన్న రైతన్నల వెన్నుముక విరిచెయ్యాలని చూస్తున్నారు దళారులు. ఓవైపు పండించిన పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వకుండా.. మరోవైపు నకిలీ విత్తనాలతో రైతులను ఆగం పట్టించాలని చూస్తున్నారు. అయితే ఇలాంటివారి పని పట్టడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారుగా. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించడంతో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలోని కడెం మండలం అల్లంపల్లి, పాలరేగడి, బాబానాయక్ తండాల్లో ఒక వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలు తన ఇంట్లో పెట్టుకుని గ్రామస్తులకు అమ్ముతున్నాడని సమాచారం అందింది. దీంతో కడెం ఎస్ఐ, మండల వ్యవసాయ అధికారితో కలిసి దాదాపు 116 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.1,16000 వరకు వాటి విలువ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నకిలీ విత్తనాలు కలిగున్న తొడసం నరేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, విత్తనాల బస్తాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ విత్తనాలను అపరిచిత వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఇచ్చారని నరేష్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. 

ఒక్కొక్క ప్యాకెట్ విలువ రూ.1000 ఉంటుందని.. అమ్మి పెడితే రూ.200 కమీషన్ ఇస్తామని చెప్పడంతో అత్యాశకు పోయి విత్తనాల దుకాణం వ్యాపారి కేసులో ఇరుక్కున్నారని చెప్పారు. వ్యాపారులు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఈ నకిలీ పత్తి విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సరఫరా చేశారు? అతను జిల్లాలో ఇంకా ఎవరికైనా ఇచ్చారా? అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. తక్కువ ధరకు విత్తనాలు లభిస్తున్నాయని రైతులు విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దని అన్నారు. ఆశతో విడి విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని ఎస్పీ సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేసేందుకు వెనకాడేది లేదని చెప్పారు. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి, ఖానాపూర్ మండల కేంద్రంలోని విత్తనాలు, రసాయన ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాపారులు స్టాకు లైసెన్సు బిల్ బుక్కులు తదితర వివరాలు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.