దుర్గా దేవి తొమ్మిది అవతారాలు.. విశిష్టత  - MicTv.in - Telugu News
mictv telugu

దుర్గా దేవి తొమ్మిది అవతారాలు.. విశిష్టత 

October 23, 2020

దసరా పండగ అనగానే అందరికి దుర్గా దేవి నవరాత్రులు గుర్తుకు వస్తాయి. నవ అంటే నూతన అని, రాత్రి అంటే జ్ఞానం అని అర్థం. వీటిని భక్తులకు ప్రసాదించే రోజే నవరాత్రి ఉత్సవాలు అని చెప్పారు. తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. మహిసాసుడు అనే రాక్షసుడిని చంపేందుకు లోక కల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందుకే  ఒక్కో రోజు ఒక్కో రూపంతో అమ్మవారిని అలంకరించి ఆయా నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని, అందుకే నవ దుర్గలుగా, దుర్గా దేవి అమ్మవారిని పూజిస్తారని చరిత్ర చెబుతోంది. దుర్గా దేవి అవతారాలు, ఆ పూజ వల్ల కలిగే ప్రయోజనాలు ఇలా ఉంటాయి.

  • బాలా త్రిపుర సుందరీ : సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పదని భక్తుల విశ్వాసం. అందుకే  శ్రీ బాలాత్రి పుర సుందరీ దేవి ప్రథమ స్థానంలో ఉంది. సకల శక్తి పూజలకు మూలమైన ఆమెను దర్శించి పూజలు చేస్తే.. సంవత్సరం అంతా మంచి కలుగుతుందని భావన. 

 

 

  • శ్రీ గాయత్రి దేవి : సమస్త మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం. అందుకే రెండో రోజు ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో .. పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. త్రిసంధ్యా సమయాల్లో వేయి సార్లు గాయత్రి మంత్రాన్ని పటిస్తూ ఉంటారు. 

 

 

  •  శ్రీ మహాలక్ష్మి దేవి : మూడో అవతారం అత్యంత మంగళ ప్రదంగా భావిస్తారు. ఆరోజు  దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో ఉంటారు. అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. 

 

 

  •  శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి :  సమస్త జీవరాసి మనుగడకు ఆధారం ఆహారం. సాక్షాత్తు పరమ శివుడికే అన్నం పెట్టిన మాతగా శ్రీ అన్నపూర్ణా దేవికి పేరు ఉంది. అందుకే అమ్మవారి ఈ  అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారంగా భావిస్తారు.  అందుకే ఈ రూపంలో దర్శిస్తే ధన ధాన్య వృద్ధి ఉంటుందని చెబుతారు. 

 

 

  •  శ్రీ లలితా త్రిపుర సుందరీ : ఈ రూపాన్నే ఉగ్ర రూపిణిగా లేదా చండీదేవిగా పిలుస్తారు.. దేవి ఉపవాసకులకు ముఖ్య దేవత. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. దీని వల్ల సమస్త శుభాలు, సౌక్యాలు లభిస్తాయి. 

 

 

  •  శ్రీ మహా సరస్వతీ దేవి : చదువుల తల్లిగా సరస్వతీ దేవిని కొలుస్తారు. నవరాత్రి అలంకారంలో త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి ఉంటారు. అక్షర మాల ధరించి, దండ, కమాండలంతో వీణా ధారణలో ఉంటుంది.  అభయముద్రతో అమ్మవారు భక్తుల అజ్ఞానాన్ని దూరం చేస్తుంది.

 

 

  •  శ్రీ దుర్గా దేవి అలంకారం : దుర్గతులను నాశనం చేసే రూపమే శ్రీ దుర్గా దేవి అలంకారం. ఆ రోజు దుర్గముడు అనే రాక్షసున్ని సంహరించింది. కనుక దేవిని ‘దుర్గ’ అని కూడా పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తారాలు,  శ్రీ లలిత సహస్రనామాలుతో పూజిస్తారు.  ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎరుపు రంగు పుష్పాలతో అమ్మను పూజించాలి.

 

 

  •  శ్రీ మహిషాసుర మర్ధినీ : మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది.  రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసిందని చరిత్ర చెబుతోంది. 

 

 

  •  శ్రీరాజరాజేశ్వరి దేవి : ఇక చివరి అవతారం  శ్రీ రాజరాజేశ్వరి దేవి. అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత’ అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి ‘విజయ’ అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై ఉంటుంది.