మద్యం బాటిళ్ల ఎఫెక్ట్.. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

మద్యం బాటిళ్ల ఎఫెక్ట్.. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు రాజీనామా

October 1, 2020

Durga Temple Trustee Naga Varalakshmi

దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వెంకట నాగ వరలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. ఈ లేఖను దుర్గగుడి ఈవో, పాలకమండలి చైర్మన్‌తో పాటు జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు పంపించారు. ఆమె అధికారిక వాహనంలో అక్రమ మద్యం రవాణా జరగడంతో నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆమె డ్రైవర్ తప్పును అంగీకరించి పోలీసులకు సరెండర్ అయ్యాడు. 

రెండు రోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీ 16 బీవీ 5577  నంబరు గల నాగ వరలక్ష్మి కారులో  భారీ ఎత్తున మద్యం బాటిళ్లు తరలించారు. పోలీసుల తనిఖీల్లో రూ. 40 వేల విలువైన మద్యం సీసాలు దొరికాయి. ఈ వ్యవహారం పెను దుమారం రేపింది. పవిత్రమైన పదవిలో ఉండి ఇలాంటి అక్రమ దందాలు ఏంటనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం కూడా ఈ చర్యతో ఇరకాటంలో పడిపోయింది.  దీంతో ఆమె భర్త వరప్రసాద్, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఆమె దుర్గ గుడి పాలక మండలి నుంచి తప్పుకున్నారు. కాగా,విజయవాడలో ఓ విందు కోసం ఇంత భారీగా మద్యాన్ని తెచ్చారని సమాచారం.