కేబుల్ బ్రిడ్జి వద్ద ఆంక్షలు.. రాత్రి 11 తర్వాత వాహనాలకు నో ఎంట్రీ - MicTv.in - Telugu News
mictv telugu

కేబుల్ బ్రిడ్జి వద్ద ఆంక్షలు.. రాత్రి 11 తర్వాత వాహనాలకు నో ఎంట్రీ

October 3, 2020

bvgnvgnf

హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రతి రోజు రాత్రి 11 గంటల తర్వాత వాహనాలకు అనుమతి లేదని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. తిరిగి ఉదయం 6 గంటల తర్వాతనే వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. పర్యాటకుల తాకిడి పెరుగుతుండటం, రాత్రి వేళల్లో వాహనాలు వేగంగా వస్తుండటంతో నిబంధనలు తెచ్చారు. వారంతాల్లోనూ కఠిన ఆంక్షలకు సిద్ధం అయ్యారు. 

జూబ్లీహిల్స్‌ నుంచి హైటెక్‌ సిటీ కనెక్టివిటీ కోసం దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మించారు. ఇటీవలే దీని పనులు పూర్తి కావడంతో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి పర్యాటకుల తాకిడి పెరిగింది. వాహనాలు వస్తున్నా కూడా లెక్కచేయకుండా ఫొటోలు దిగుతున్నారు. దీనికితోడు అక్కడ పార్కింగ్ సమస్య ఏర్పడటంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది. అందుకే ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వంతెనను మూసివేయనున్నారు. కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతిస్తున్నారు. మిగితా రోజుల్లో మాత్రం రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మూసివేస్తారు. సందర్శకులు కూడా రేలింగ్‌ వైపు నిల్చోవడం, వాహనాలు పార్కింగ్‌ చేయడం, పుట్టిన రోజు వేడుకలు చేయడాన్ని నిషేధించారు. భారీ వాహనాలకు కూడా అనుమతి లేదన్నారు. బ్రిడ్జిపై కేవలం 35 కిలోమీటర్ల వేగంతోనే వాహనాలు నడపాలని సూచించారు.