కళల్లో సూక్ష్మకళ వేరయా. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు మైక్రో ఆర్టిస్టులు చేస్తున్న అద్భుతాలు అమోఘం. సూక్ష్మదృష్టితో చాలా సున్నితంగా చేయాల్సిన ఆ పనికి ఎంతో ఓపిక కావాలి. మొన్నటికి మొన్న హైదరాబాద్‌కు చెందిన న్యాయవిద్య చదివే రామగిరి స్వారిక అనే యువతి బియ్యపు గింజలపై హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను రాసి అరుదైన రికార్డు నెలకొల్పింది. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలను.. మొత్తం 36,378 అక్షరాలతో కూడిన 9,839 పదాలను రాసింది. మొత్తం 4,042 బియ్యపు గింజలపై రాసి రికార్డు నెలకొల్పింది. బియ్యపుగింజలపై కేవలం 150 గంటల్లోనే భగవద్గీత రాసి వహ్వా అనిపించింది.
తాజాగా మరో మైక్రో ఆర్టిస్టు తనదైన శైలిలో అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపాడు. ఏకంగా అమ్మవారి రూపురేఖలను పెన్సిల్ మొనపై చిత్రీకరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. విశాఖకు చెందిన అతని పేరు వెంకటేష్. ఇప్పటివరకు ఎన్నో రకాల కళాకృతులను రూపొందించాడు. తన సూక్ష్మ కళతో వెంకటేష్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించుకున్నాడు. కేవలం చిన్న చిన్న వస్తువులపై ఎంతో అద్భుతమైన రూపాలను ఆవిష్కరించడం వెంకటేష్‌కు వెన్నతో పెట్టిన విద్య. అతని కళకు ఫిదా అయిన నెటిజన్లు దసరా శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, నూతన సంవత్సర శుభాకాంక్షలను కూడా ఇలాగే పెన్సిల్ మొనపై 2020 అని చెక్కి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు.