ఆదివారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీతో సహ ఆయన భజన బృందంపై సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతూ.. ప్రధాని సంకుచిత రాజకీయాలు వీడాలన్నారు. ఆయన పక్కనే ఉన్న కాషాయ దళం.. పొగుడుతూనే ఉంటుందన్నారు. ఏందా పొగుడుడు? అయినదానికీ కానిదానికీ పొగుడుడేనా? భజన బృందం మోదీనిట్ల పొగుడతనే ఉంటది. పొగుడుతనే ఉంటరు. ఎప్పటిదాకా. మాజీ ప్రధాని అయ్యేదాక. తర్వాత మాజీ ప్రధాని మోదీ అని పొగుడుతరు. పొగిడేటోనికి పొయ్యేదేముంది? అని అన్నారు.
ఇక ఆ బృందంలోని దేశ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురించి ప్రస్తావిస్తూ.. “ఇంతపెద్ద ఈ సువిశాల భారతదేశానికి అర్థిక మంత్రిగా పనిచేసే వ్యక్తి వచ్చి, బాన్సువాడలో ఒక రేషన్‌షాపు దగ్గరికి వచ్చి నిలబడి డీలర్‌తో కొట్లాట పెట్టుకుంటదా? ప్రధానమంత్రి ఫొటో ఎందుకు పెట్టలేదని! ఒక డీలర్‌తో దేశ ఆర్థిక మంత్రి కొట్లాటపెట్టుకుంటదా? పాపం.. సిందువులో బిందువంత డీలర్ ఏమై పోవాలె? అయినా ఏం సాధించిండని, ఏం గొప్పతనం చూపిండని మోదీ ఫొటో పెట్టుకోవాలె?” అంటూ సెటైర్లు వేశారు.
గతేడాది సెప్టెంబర్‌లో కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీర్కూర్‌లోని ఓ రేషన్ దుకాణానికి వెళ్లారు. గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఎంత బియ్యం పంపిణీ చేస్తుందన్న ప్రశ్నకు, సమాధానంగా రేషన్ వివరాలను చెప్పలేదని కలెక్టర్ జితేష్ పాటిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాప్‌లో మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని అక్కడున్న డీలర్‌పై మండిపడ్డారు.