During the Sankranti festival, the traffic on the Hyderabad-Vijayawada national highway has increased
mictv telugu

హైవేపై బారులు తీరిన వాహానాలు.. భారీగా ట్రాఫిక్ జామ్

January 13, 2023

During the Sankranti festival, the traffic on the Hyderabad-Vijayawada national highway has increased

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్‌ నగరంలోని జనమంతా సొంతూళ్లకు బయల్దేరారు. కొందరు ముందుగానే ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుంటే మరికొందరు తమ వీలును బట్టి ప్రైవేట్ వాహనాల్లో.. సొంత వాహనాల్లో ఊళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా రద్దీ పెరిగింది. పండుగ వేళ ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి. ఒక దశలో ట్రాఫిక్‌ కిలోమీటరు మేర నిలిచిపోయింది. ఫాస్టాగ్‌ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాలు పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్‌లు స్కాన్‌ కాకపోవడంతోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్‌ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు. రాచకొండ పోలీసులు, జీఎంఆర్‌ టోల్‌గేట్‌ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని టోల్‌ ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంపై టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పందించారు. ‘‘సొంత వాహనాల్లో ఊళ్లకు వెళ్తూ టోల్‌ ప్లాజాల వద్ద సమయాన్ని వృథా చేసుకోవద్దు. గంటల తరబడి టోల్‌ ప్లాజాల వద్ద నిరీక్షించవద్దు. టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. టోల్‌ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారు’’ అని సజ్జనార్‌ తెలిపారు.