తబ్లిగీ జమాత్ వల్లే దేశమంతా.. సీఎం సంచలన వ్యాఖ్యలు
దేశంలో కరోనా కేసులు పెరగడానికి మార్చి నెలలో ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాతే కారణమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఇందుకు తబ్లీగీ బాధ్యత వహించాలని అన్నారు. శనివారం ఆయన ‘ఈ-అజెండా ఆజ్‌తక్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మత ప్రార్థనలకు హాజరైన వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని అన్నారు. తబ్లీగీ చేసిన చర్య ఖండించదగినదని తెలిపారు. తొలిదఫా విధించిన లాక్‌డౌన్ వల్ల దేశంలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చేదని.. కానీ తబ్లీగీల చర్యతో కరోనా మరింత వ్యాప్తి చెందిందని ఆరోపించారు.
తబ్లీగీ జమాత్ నేరపూరితమైన చర్యకు పాల్పడిందని మండిపడ్డారు. ‘ఈ మత ప్రార్థనలకు యూపీ నుంచి 3 వేల మంది హాజరయ్యారు. ఒక వ్యాధి రావడం నేరం కాదు.. కానీ, దానిని వ్యాపించేందుకు కారణం అవడం మాత్రం నేరమే. ఢిల్లీలో జరిగిన తబ్లీగీకి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినవారిపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని యోగీ తెలిపారు.
కాగా, యూపీలో 2,338 పాజిటివ్ కేసులు నమోదవగా.. వారిలో 654 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 42 మంది మృత్యువాతపడ్డారు. యూపీలో రెడ్ జోన్ పరిధిలో 19 జిల్లాలు ఉన్నాయి. 36 జిల్లాలు ఆరంజ్ జోన్‌లో ఉండగా.. 20 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో గౌతమ్ బుద్ద్ నగర్, మొరదాబాద్, ఆగ్రా, లక్నో, ఘజియాబాద్‌లు ముందుగా ఉన్నాయి.