పోలీసుల వల్ల.. 15వేల లీటర్ల పాలు రోడ్డుపాలు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసుల వల్ల.. 15వేల లీటర్ల పాలు రోడ్డుపాలు

March 26, 2020

E-Tailers Allege Police Wastage of Milk And Veg  

లాక్‌డౌన్‌లో భాగంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎవరూ బయటకు రాకుండా లాఠీలకు పని చేబుతున్నారు. కానీ ఈ తీరుతో ప్రజలు రోడ్లపైకి రాకపోవడమేమో కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం తలెత్తుతున్నాయి. నిత్యావసర వస్తువులు సరఫరా చేసే ఈ కామర్స్ సంస్థలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. ఫలితంగా తాజాగా కేవలం దేశ రాజధాని ఢిల్లీలోనే 15 వేల లీటర్ల పాలు, 10 వేల కిలోల కూరగాయలు వృథా అయ్యాయి. పోలీసుల తీరు కారణంగా తమ సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని బిగ్ బాస్కెట్, ఫ్రెష్ మెనూ, ఫోర్టియా లాంటి సంస్థలు చెబుతున్నాయి. 

రోడ్లపైకి వచ్చిన ప్రతి ఒక్కరిని పోలీసులు తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు. ఎవర్నీ మరో ప్రాంతానికి వెళ్లనివ్వడం లేదు. ఇంకా కొందరు అయితే లాఠీలతో  కొడుతున్నారు. ఇటువంటి సమయంలో డెలివరీ బాయ్స్ కూడా పని చేసేందుకు ముందుకు రావడం లేదు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయాలని చూస్తే.. తాము కష్టాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల డెలవరీకి ఎటువంటి ఆటంకం ఉండబోదన్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజా పాలను అందించే అవకాశాలు కనిపించడం లేదని ఫ్రెష్ హోమ్స్ సంస్థ పేర్కొంది.

బిగ్ బాస్కెట్, మిల్క్ బాస్కెట్,ఫ్రెష్ హోమ్స్ లాంటి పాలు, కూరగాయలు ఆన్‌లైన్ డెలివరీ చేసే  సంస్థలు తమ బాధను వెల్లబోసుకుంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అయ్యాయని ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరు కారణంగా తాము తెచ్చిన వస్తువులు వృథా అవుతున్నాయని అంటున్నారు. కాగా ఈ సంస్థలు నోయిడా, గురుగ్రామ్, హైదరాబాద్ వంటి నగరాల్లో పని చేస్తున్నాయి. అక్కడ సరఫరా కోసం సేకరించిన  పాలను పారబోయాల్సి వచ్చిందని మిల్క్ బాస్కెట్ వాపోయింది. అయితే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం వీరి కోసం ప్రత్యేకించి పోలీసులకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది.