Earlier, KA Paul bumper offer for youth
mictv telugu

యువతకు ఉచితంగా పాస్‌పోర్ట్, వీసా: కేఏ పాల్

September 20, 2022

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంపైనే దృష్టి సారించాయి. ఉపఎన్నిక ఎప్పుడొచ్చిన మునుగోడు గడ్డపై తమ పార్టీ జెండాను ఎగరవేయాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించి, ఉప ఎన్నికలో గెలిస్తే, మునుగోడును అన్ని విధాలుగా అభివృద్ది చేసేందకు ప్రయత్నాలు చేస్తామని హామీలు ఇచ్చాయి.

అంతేకాదు, మునుగోడు ప్రజలు ఏం ఆశిస్తున్నారు? ఏ పార్టీవైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు? అనే తదితర అంశాలపై రహస్యంగా సర్వేలు చేయిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా విస్కృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి రెడ్డిని ప్రకటించారు. కానీ, టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు అనేది ఇంకా అధిష్టానం ప్రకటించలేదు.

ఇటువంటి సమయంలో ప్రజా శాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ కాసేపటిక్రితమే ఓ సంచలన ప్రకటన చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ”మునుగోడు నియోజకవర్గంలోని యువతీ, యువకులకు ప్రజా శాంతి పార్టీ బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. నా (కేఏ పాల్) 59వ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని 50 మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తా. ఆ లాటరీలో గెలిచిన విజేతలకు పాస్ పోర్ట్, అమెరికా వీసా ఉచితంగా ఇప్పిస్తా. కేసీఆర్, ప్రధాని మోదీ యువతను మోసం చేశారు. నిరుద్యోగుల కష్టాలు నాకే బాగా తెలుసు. నా జన్మదిన కానుకగా అందిస్తున్న అవకాశాన్ని మునుగోడు యువత ఉపయోగించుకోండి” అని ఆయన అన్నారు.