భూమి తిరగడం ఆగిపోతే..! - MicTv.in - Telugu News
mictv telugu

భూమి తిరగడం ఆగిపోతే..!

December 2, 2017

అనంత విశ్వంలో మహాద్భుతం భూమి. పుడమితల్లి పొత్తిళ్లలోనే అనంత కోటి జీవరాశి ప్రాణం పోసుకుంది. తన చుట్టూ తాను తిరుగుతూ.. అదే సమయంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ మనల్ని భూతల్లి బతకిస్తుంది. గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. అయితే ప్రతీ లక్ష సంవత్సరాలకు ఒకసారి భూభ్రమణ వేగం రెండు సెకన్లు తగ్గుతుందనేది సైంటిస్టుల వాదన. ఇలా భూమి తిరిగే వేగం మందగించడం వల్ల వచ్చే ఏడాది… భారీ తీవ్రతతో భూకంపాలు వస్తాయని సైంటిస్టులు చెపుతున్నారు. సపోజ్ ఫర్ సపోజ్..  ఒకవేళ ఏదో ఒక రోజు భూమి తిరగడం పూర్తిగా ఆగితే ఏమవుతుంది?  ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అప్పుడు ఎవరూ బతికి ఉండకపోవచ్చు. కాని అప్పుడు ఏమవుతుందో? చెప్పడానికి ఇప్పుడు సైంటిస్టుల  దగ్గర ఓ ఈక్వేషన్ ఉంది. అందుకే రేపో మాపో భూమి తిరగడం స్లో అవుతుందనుకుని ఈక్వేషన్‌ను మనం కూడా ఓ సారి తెలుసుకుందాం. రాబోయే ఆ ఉపద్రవాన్ని ఇప్పుడే ఊహించుకుందాం.

మొదటి రోజు

భూభ్రమణంలో కలిగిన మార్పును మనిషి గుర్తించలేడు. కాని సూర్యోదయ సమయంలో మాత్రం ఆ తేడా కచ్చితంగా కనిపిస్తుంది. భూమి మాత్రమే స్లోగా తిరుగుతుంది. పైన కక్షలో ఉండే ఉపగ్రహాలు మాత్రం రోటీన్ స్పీడ్తోనే రౌండ్స్ వేస్తుంటాయి. ఈ మార్పును గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గుర్తించదు. దీంతో విమానాలు దారి తప్పుతాయి. ప్రపంచ వ్యాప్తంగా విమానాలన్నీ రన్ వేలకు దూరంగా దిగుతాయి. ప్రాణం నష్టం ఉండకపోవచ్చు. కాని ఫ్యూచర్ ఇంతకంటే భయంకరంగా ఉంటుందన్నది మాత్రం తెలుస్తుంది.  

వారం తరువాత

భూమి తిరిగే స్పీడ్ స్లో అవడం గంటకు 15 కి.మీ.కి పెరుగుతుంది. విమాన ప్రమాదాలు కామన్ అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్ట్‌లన్నీ మూతబడతాయి. అమెరికా అధ్యక్షుడైనా, అంబానీ అయినా విమానాన్ని చూస్తేనే వణికిపోతారు. రెండు వారాలకు అసలు కథ మొదలవుతుంది. భూమి తన మానానా తాను తిరుగుతుంటే సముద్రాల్లోని నీళ్లు స్థిరంగా ఉండేవి. భూభ్రమణం ఆ నీటిని పట్టి ఉంచేది. కాని భూమి తిరిగే స్పీడ్ స్లో కావడంతో ఆ శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా సముద్రపు నీళ్లను ధృవాలు ఆకర్షిస్తాయి. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు జలప్రళయంలో చిక్కుకుంటాయి. నీళ్లే కాదు గాలి కూడా మనుషుల ప్రాణాలు తీస్తుంది. ఒక్కసారిగా సముద్రాలు దిశ మార్పుకోవడంతో గాలి కూడా అవి వెళుతున్న వైపే పోతుంది. ఫలితంగా భూమిపై కొన్ని ప్రాంతాల్లో గాలి ఉండదు. రియో డీజనీరో, ముంబై, సింగపూర్ జనాలకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఐదు వేల మీటర్లపైన ఆకాశంలో శూన్యం ఏర్పడుతుంది.

ఐదు నెలల తర్వాత

భూభ్రమణ వేగం స్లో అవడం గంటకు 225 కి.మీకు పెరుగుతుంది. రోజుకు ఇరవై నాలుగు గంటలన్న ఈక్వేషన్ మారుతుంది. పగలు రెండు గంటలు ఎక్స్ ట్రా, రాత్రి రెండు గంటలు బోనస్.. భరించడం కష్టమే కాని అలవాటు చేసుకోక తప్పదు. ఈ ఐదు నెలల కాలంలో యుగాల విలయం సంభవిస్తుంది. రిక్టర్ స్కేలు బద్దలయ్యే భూకంపాలు రోజూ వస్తాయి. అటు సముద్రంలోపలా అలజడి చెలరేగుతుంది. చేపలతో పాటు సముద్రజీవాలు చచ్చి తీరానికి కొట్టుకొస్తాయి. భూమధ్య రేఖ నుంచి ధ్రువాలవైపు సముద్ర నీరు కదలడంతో ఆర్కిటిక్ సముద్రపు లోతు 13 వేలకు చేరుతుంది. దీంతో ఇంగ్లీష్ ఛానల్ పూర్తిగా ఎండిపోతుంది. లండన్ నుంచి ప్యారిస్‌కు నడుచుకుంటూ పోవచ్చు. షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా ఇష్టపడని అమెరికా, క్యూబాలు భౌగోళికంగా కలిసిపోతాయి. మెక్సికో వైశాల్యం పెరుగుతుంది. కేరళ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇసుక మేటలే కనిపిస్తాయి.

భూభ్రమణం స్లో కావడంతో భూమధ్యరేఖకు పైన లేదా కింద మాత్రమే గాలి ఉంటుంది. సెంటర్‌లో ఉన్న దేశాల్లో గాలి ఉండదు. న్యూయార్క్, లండన్, టోరంటోలో పుష్కలంగా ఆక్సిజన్ ఉంటే. మెక్సికోతో పాటు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ప్రాణవాయువు దొరకదు. సముద్రపు నీరు ధ్రువాల వైపు కదలడంతో న్యూయార్క్, బోస్టన్, హాలిఫాక్స్ తీర ప్రాంతాల వైశాల్యం పెరుగుతుంది. ఇండోనేసియాతో కలిసి ఆస్ట్రేలియా కొత్త ఖండంగా ఏర్పడుతుంది. హాంకాంగ్‌తో పాటు ఆసియాలోని కొన్ని తీర ప్రాంతాలు పూర్తిగా ఎండిపోతాయి.

సంవత్సరం తర్వాత

గంటకు 340 కి.మీ స్పీడ్‌తో భూమి తిరుగుతుంది. భూనైసర్గిక స్వరూపం ఇంకా మార్పులకు లోనవుతూనే ఉంటుంది. లండన్ నుంచి ప్యారిస్‌కు నడుచుకుంటూ పోయే పరిస్థితి మాత్రం ఉండదు. సముద్రపు నీళ్లన్నీ ధ్రువాల వైపు కదలడంతో నార్త్ అట్లాంటిక్ సముద్రం ఫుల్ అవుతుంది. కొత్తగా వచ్చే నీటిని తన గర్భంలో దాచుకోలేదు. దీంతో యూరప్ ఖండం స్థానంలో కొత్త సముద్రం ఏర్పడుతుంది. లండన్, బెర్లిన్, మాస్కో సముద్రగర్భంలో కలుస్తాయి. కోట్లాది మంది కన్నుమూస్తారు.

రెండు సంవత్సరాల తర్వాత

పగలు రెండున్నర రోజులతో సమానం..అలాగే రాత్రి కూడా..పడుకోవాలంటే 60 గంటలు వెయిట్ చేయాలి.. సూర్యోదయాన్ని చూడాలంటే సిక్టీ అవర్స్ ఎదురుచూడాలి..ఒక రకంగా జెట్ లాక్ ఫీలింగ్. ఈ అనూహ్య మార్పు మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. వరదలు, సోలార్ రేడియేషన్, గాలి లేకున్నా ఏదోలా బతికిన మనుషుల్ని నిద్రలేమి కసితీరా కాటేస్తుంది. రక్తప్రసరణలో తేడా వచ్చి నరాలు కంట్రోల్ తప్పుతాయి. ఈ మార్పులను మెదడు అస్సలు తట్టుకోలేదు. ఎక్కడిక్కడ మనుషులు పిట్టలా రాలిపోతారు. ఒక్క మనుషులే కాదు..మిగతా ప్రాణికోటి కూడా బలవుతుంది. సన్ రైజ్ టూ సన్ షైన్ వేయిట్ చేయలేక పక్షులు, జంతువుల ప్రాణం పోతుంది. సుదీర్ఘ రాత్రులతో ఏర్పడ్డ చలితో మరికొన్ని జీవాలు చనిపోతాయి. ధృవాల దిక్కు సముద్రాలు కదిలాక అమెరికా దగ్గర్లో కొత్త భూభాగం ఏర్పడుతుంది. శాన్ ఫ్రాన్సిస్కో కు దగ్గరగా ఉండడంతో కొంతమంది అక్కడికి పోవచ్చు.

నాలుగు సంవత్సరాల తర్వాత

గంటకు 60 కి.మీ స్పీడ్ తో భూమి తిరుగుతుంది. ఆకాశంలో సూర్యుడు 13 రోజుల దాక ఉంటాడు. 13 రోజుల తర్వాత 13 రోజుల రాత్రి.  ఉష్ణోగ్రత  మైనస్ 55 డిగ్రీలకు పడిపోతుంది. ఈ దుర్భర పరిస్థితుల్లో జీవాలతో పాటు మొక్కలు కూడా బతకలేవు. కాని కెనడా, నార్త్ అమెరికాలో మాత్రం అడవులు పచ్చగానే ఉంటాయి. సముద్రాలు ధ్రువాల వైపు కదలడంతో ఖాళీ అయిన ప్రదేశం ఒక కొత్త ఖండంగా తయారవుతుంది. ఈ మెగా కాంటినెంట్‌లోని మెజార్టీ ఏరియాల్లో గాలి పుష్కలంగా ఉంటుంది. మనిషి జీవించడానికి అనువైన వాతావరణం ఉంటుంది. కాని ఉన్నట్టుండి భయంకరంగా మారుతుంది .భూమి నార్మల్‌గా తిరుగుతున్నప్పుడు తూర్పు దిశలో పయనించే గాలి ఉత్తరం వైపు ఉండేది. పశ్చిమ దిశలో వీచే గాలి దక్షిణ ప్రాంతంపై ఆవరించి ఉండేది. కాని భూభ్రమణంలో వచ్చిన తేడాతో గాలి గతి తప్పుతుంది. తుఫానులు కామన్ అవుతాయి. 13 రోజుల పాటు రాత్రి ఉండడంతో ఉత్తర అమెరికాతో పాటు చాలా ప్రాంతాలు పూర్తిగా మంచులో కూరుకుపోతాయి.

ఐదు సంవత్సరాల తర్వాత

రెండు కొత్త మహా సముద్రాలు ఏర్పడుతాయి. అమెరికాలోని కేన్ సన్ సముద్రతీర ప్రాంతంగా మారుతుంది.  ఉత్తర అమెరికాలోని  8 లక్షల కిలోమీటర్ల భూభాగం మనుషుల నివసించడానికి అస్సలు పనికిరాదు. మిగిలిన ప్రాంతాల్లో బతికి ఉన్న ప్రజలకు ఈ ప్రాంతమే దిక్కవుతుంది.

ఫైనల్ డే

భూమి తిరగడం కంప్లీట్ గా ఆగిపోతుంది. కాని సూర్యుని చుట్టూ మాత్రం పరిభ్రమిస్తుంది. అప్పటి నుంచి పగలు ఆరు నెలలు, రాత్రి ఆరు నెలలు ఉంటుంది. రెండు కొత్త సముద్రాలతో భూమి రూపు రేఖలు పూర్తిగా మారుతాయి. ప్రపంచం మధ్యలో కొత్త ఖండం ఏర్పడుతుంది. భూమధ్య రేఖ కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఉండదు. పగలు ఆరునెలలు కావడంతో టెంపరేచర్ బీభత్సంగా పెరుగుతుంది. 60 డిగ్రీలకు చేరుతుంది. సముద్ర ఉపరితలంపై పీడనాలు ఏర్పడి భీకర తుఫాన్లు వస్తాయి. కంటిన్యూగా వర్షాలు కురుస్తాయి. కొత్త ఖండంపై ఎవరైనా బతికి ఉంటే వాళ్లకు ఆ వర్షపు నీళ్లే దిక్కు.. రాత్రి రాక్షసంగా ఉంటుంది. మైనస్ యాభైఐదు డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోతుంది. కొత్త ఖండం లో కాకుండా ఇంకా ఎక్కడైనా ఎవరైనా బతికి ఉంటే వాళ్లంతా చచ్చిపోతారు.భూమి తిరగడం ఆగిన సంవత్సరానికి

70 కోట్ల మంది చనిపోతారు. కొత్త ఖండంలో ఉన్నవాళ్లు సుదీర్ఘ పగలు, రాత్రులతో యుద్ధం చేయాలి. భూమి మళ్లీ తిరక్కపోదా  అన్న ఒకే ఒక నమ్మకంతో వాళ్లంతా క్షణ క్షణం చస్తూ బతుకుతుంటారు..

అయితే  భూభ్రమణం నిజంగానే ఆగుతుందా? ఈ ప్రశ్నకు ఇప్పటికిప్పుడు సమాధానం దొరక్కపోవచ్చు. కాని రేపు ఏమైనా కావొచ్చు. మనకు చెప్పి భూమి తిరగడం లేదు. మన దగ్గర మాట తీసుకుని భూమి తిరగడం ఆపదు. ఏదైనా జరగొచ్చు. అప్పటిదాక భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టు తిరుగును అన్న సామాన్య శాస్త్రం లైన్ ను చదువుకోండి ..