Earthquake in Delhi, severe earthquake in Nepal
mictv telugu

ఢిల్లీలో భూప్రకంపనలు, నేపాల్ తీవ్ర భూకంపం

November 9, 2022

ఈరోజు తెల్లవారుఝామున భూకంపం నేపాల్, ఢిల్లీ పరిసర ప్రాంతాలను వణికించింది. నేపాల్లో భారీగా భూమి ప్రకంపించింది. అక్కడి భూకంపం ప్రభావం మన దేశంలోని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌,పిథోరాఘడ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా తెల్లవారుజామున 1.57 గంటలకు భూమి కదిలింది. వణికిస్తున్న చలిలో తెల్లవారుఝామున సంభవించిన భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న ఢిల్లీ ప్రాంత ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్ కేంద్రంగా సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center forSeismology)వెల్లడించింది.నేపాల్ దేశంలో మంగళవారం రాత్రి కూడా రెండు సార్లు భూమి కంపించింది. గడచిన 12 గంటల్లో నేపాల్ లో మూడు సార్లు భూకంపం వచ్చిందని అధికారులు చెప్పారు. నేపాల్ దేశంలో మంగళవారం రాత్రి 8.52 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. తర్వాత మంగళవారం రాత్రి 9.41 గంటలకు 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇప్పటివరకు ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది.

 

భూప్రకంపనలతో పరుగులు తీసిన ప్రజలు

తెల్లవారుజామున 1.57 గంటలకు 6.3 తీవ్రతతో మూడోసారి భూకంపం సంభవించింది. మూడోసారి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి.ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి.యూపీలోని మొరాదాబాద్‌లోని ఒక కార్యాలయంలో భూకంపం తీవ్రత సీసీటీవీ ఫుటేజ్ లో నమోదైంది.కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లోని పలువురు ప్రజలు సోషల్ మీడియా తమ అనుభవాలను ఏకరవు పెట్టారు. గాఢనిద్రలో ఉన్న ప్రజలు భూప్రకంపనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.