అసలైన హీరోలు మీరే.. ధర్మాడి సత్యం టీంకు కలెక్టర్ అభినందనలు.. - MicTv.in - Telugu News
mictv telugu

అసలైన హీరోలు మీరే.. ధర్మాడి సత్యం టీంకు కలెక్టర్ అభినందనలు..

October 23, 2019

East Godavari Collector felicitate boat salveging expert dharmadi satyam.. Presents Rs 20 Lakh Cheque

నాలుగు ఫైట్లు చేసి, అన్యాయం చమడాలు ఒలిచే క్రమంలో కథానాయకుడు వీరోచితంగా పోరాడతాడు. అసహాయులకు అండదండగా ఉంటాడు గనక అతన్ని హీరో అన్నాం. అతని హీరోయిజానికి చప్పట్లు కొడతాం.. ఈలలు వేస్తాం.. ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానిస్తాం. అదంతా అతని నటన అని తెలిసినా ఆ స్క్రీన్ ప్రెజెంట్‌నే దృష్టిలో పెట్టుకుని డైహార్ట్ ఫ్యాన్స్ అయి అభిమానిస్తాం. మరి నిజ జీవితంలో అంతకుమించిన హీరోలు వుంటారు. ఎందరో కన్నీళ్లను వారు తుడుస్తారు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా.. ఎలాంటి డూప్స్ పెట్టుకోకుండా తమ స్వశక్తితో ఇతరులను కాపాడటానికే వీళ్లు పుట్టారు అనిపిస్తుంది. ఇలాంటి నిజమైన హీరోలను చూసే తెరమీద హీరోలు పుట్టుకొచ్చారేమో అనిపిస్తుంది. వాళ్లే ధర్మాడి సత్యం బృందం. గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటును వారు బయటకు తీయడానికి చాలా రోజులుగా శ్రమించారు. పట్టు వదలని విక్రమార్కుల్లా తమ ప్రాణాలకు తెగించి నది అడుగులోకి వెళ్లారు. నది అడుగున ఉన్న బోటుకు లంగరు చుట్టి వచ్చారు. ఎట్టకేలకు బోటును బయటకు తెచ్చారు. వీళ్లు కదా అసలు హీరోలు. 

గత 38 రోజులుగా తమవారి మీద మృతుల బంధువులు ఆశలు వదులుకున్నారు. తమవారి పార్థీవదేహాలు వచ్చినా చాలు.. వారిని కడసూపు చూసుకుని తమ చేతులతో ఈ మట్టిలో కలుపుతామని ఎదురుచూస్తున్నారు. నెలన్నర నుంచి వారు కంటిమీద కునుకు వేయలేదు. కడుపుకి అన్నం తినడం మానేశారు. మావాళ్ల కాలో, చేయో దొరికినా చాలు ఖననం చేసుకుంటాం అని వారు కన్నీరు కార్చడం చూస్తే గుండెలు బరువెక్కాయి. వారి కొండంత బాధను ఎవరూ తీర్చలేరు. తమవారి మృతదేహాన్ని చూసుకుంటేనైనా వారి బాధ కొంతలో కొంతైనా తీరుతుంది కదా. ఓవైపు తమవారిని పోగొట్టుకున్నామనే నిరాశ, మరోవైపు తమవారి మృతదేహం ఇవాళ కాకపోయినా రేపైనా లభిస్తుందనే ఆశ. ఈ రెంటిమధ్య పాపం వారు రోజు కన్నీళ్లు కారుస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆశనిరాశకు అండగా నిలిచారు ధర్మాడి సత్యం బృందం. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వేధించినా, వరదలు ఉప్పొంగినా బాధితుల బాధను కొంతలో కొంతైనా తీర్చాలని వారు కంకణం కట్టుకున్నంత పనే చేశారు. కచ్చులూరు వద్ద గోదావరిలో ఇటీవల మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం నిన్న వెలికితీసిన విషయం తెలిసిందే. బోటుతో సహా ఎనిమిది మృతదేహాలు లభ్యం అయ్యాయి. వాటిలో రెండు మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అధికారులు అప్పగించారు. మిగతా ఆరు మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి భద్రపరిచారు. 38 రోజులుగా బోటు నీళ్లల్లో ఉండటంతో మృతదేహాలు గుర్తించలేని విధంగా బాగా కుళ్లిపోయి ఉన్నాయి. దీంతో వాటిని గుర్తించడం వీలుకాకుండా పోయింది. ఈ క్రమంలో మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి అప్పగిస్తామని వైద్యులు వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో బోటును నది అడుగు నుంచి బయటకు తేవడంలో ధర్మాడి సత్యం చేసిన శ్రమను ప్రతీ ఒక్కరు గుర్తిస్తున్నారు. వాళ్లు అసలు సిసలైన హీరోలు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డిని ధర్మాడి సత్యం బృందం ఈరోజు కలిసింది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యం సహా ఆయన బృందాన్ని కలెక్టర్ శాలువాలతో సత్కరించి, అభినందించారు. బోటు వెలికి తీసినందుకు గాను ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల చెక్కును ఆయనకు అందజేశారు. ధర్మాడి సత్యంది తూర్పుగోదావరి జిల్లా  కాకినాడ. ఓ నిరుపేద కుటుంబంలో ధర్మాడి సత్యం జన్మించారు. పెద్దగా ఆయన చదువుకోలేకపోయినా ఆయన బాలాజీ మెరైన్ అనే సంస్థకు అధినేత. గతంలో ఆయన పలు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించారు.