పోలీసులు అడ్డుకున్నాడని గొంతు కోసుకున్నాడు..
కరోనా లాక్‌డౌన్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అత్యవసర పనులపై బయటికి వస్తున్న వారికి కూడా వేధిస్తున్నారు. లాక్ డౌన్ మొదట్లో కొందరు ఆకతాయిలు బయట తిరిగిన మాట నిజమే అయినా ఇప్పుడు వారి జాడ కనిపించడం లేదు. అయితే కొన్ని చోట్ల పోలీసులు దురుసుతనం, ప్రజల మొండితనం వల్ల నేరాలు కొనసాగుతున్నాయి. పనిపై బయటికి వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకోవడంతో అతడు బ్లేడుతో గొంతుకోసుకున్నాడు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన లోవరాజు అన వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా జగ్గంపేట పోలీసులు అడ్డుకుని ప్రశ్నల వర్షం కురిపించి మందలించారు. దీంతో లోవరాజు జేబులోని బ్లేడు తీసుకుని గొంతుకోసుకున్నాడు. పోలీసులు వెంటే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. రక్తం పోవడంతో లోవరాజు అపస్మారకంలోకి వెళ్లిపోయాడు. పోలీసుల వేధింపుల వల్లే గొంతు కోసకున్నాడని అతని బంధువులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం తోసిపుచ్చారు. ఇంట్లో గొడవల వల్లే బయటికొచ్చి కోసుకున్నాడని అంటున్నారు.