చికెన్ తింటున్నారా? అయితే జర పైలం - MicTv.in - Telugu News
mictv telugu

చికెన్ తింటున్నారా? అయితే జర పైలం

February 4, 2018

బాయిలర్ కోళ్లు బరువు పెరగడానికి వాడుతున్న ఓ యాంటిబయాటిక్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇండియన్ పౌల్ట్రీ పరిశ్రమల కక్కుర్తి తో సూపర్ బగ్ లను పుట్టించే ఫ్యాక్టరీగా మనదేశం మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మన పౌల్ట్రీలు  విచ్చలవిడిగా వాడుతున్న ఆ మందుతో ఏ యాంటిబయాటిక్ కు కూడా లొంగని ఇన్ ఫెక్షన్ లు తయారవుతున్నాయి.

“చివరి ఆశ”

మన పౌల్ట్రీ ఫాంలు నడిపేవాళ్లకు ఓపిక తక్కువ. తక్కువ టైంలనే ఎక్కువ లాభం రావాలనుకుంటారు. అందుకే కోళ్ల పెంపకంలో షార్ట్ కట్ లను ఉపయోగిస్తారు. తక్కువ టైంల కోళ్లు ఎక్కువ బరువు పెరగడానికి విచ్చలవిడిగా మందులు వాడుతారు. అలా వాడుతున్న మందుల్లో ఒకటి కొలిస్టిన్. నిజానికి కొలిస్టన్ అనేది మనుషులకు ఇచ్చే  యాంటి బయాటిక్. లాస్ట్ హోప్ గా, మొండి వ్యాధులపై చివరి అస్త్రంగా డాక్టర్లు దీన్ని ఉపయోగిస్తారు. అది కూడా చాలా రేర్ కేసుల్లోనే. ప్రపంచఆరోగ్య సంస్థ కూడా కొలిస్టిన్ ను ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని చెప్పింది. జంతువుల్లో ముఖ్యంగా కోళ్లకు అస్సలు వాడొద్దని హెచ్చరించింది.

చైనా పందుల్లో యాంటీ కొలిస్టిన్ జన్యువు

పౌల్ట్రీ ల్లో కొలిస్టిన్ ను ఉపయోగించడమంత పిచ్చి పని ఇంకొకటి లేదన్నారు టిమోతీ వాష్. ఈయన యాంటిబయాటిక్స్ పరిశోధనల్లో ప్రపంచ ప్రఖ్యాత నిపుణుడు. ఇంగ్లాండ్ కార్డిఫ్ యూనివర్సిటీలో మైక్రోబయాలజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టిమోతీ, 2015 లో ఓ విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ పరిశోధన ఫలితాన్ని చూసి ప్రపంచం షాక్ అయింది. కొలిస్టిన్ ను సమర్థవంతంగా ఎదుర్కునే mcr-1 అనే జన్యువును చైనా పందుల్లో టిమోతీ కనుగొన్నాడు. మనుషుల్లో వివిధ రకాల ఇన్ ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాలకు చాలా ఈజీగా ఈ జన్యువు ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం కూడా ఉందన్నాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం mcr-1 జన్యువుతో కొలిస్టిన్ కు విరుగుడును తయారుచేసుకునే అవసరం కూడా బ్యాక్టీరియాలకు అక్కర్లేదు. జస్ట్ ఆ జన్యువును ఆక్రమిస్తే సరిపోతుంది. వాటికి కొలిస్టిన్ ను తట్టుకునే శక్తి వస్తుంది.

  కొలిస్టిన్ ను బాయిలర్ కోళ్లకు రెగ్యులర్ గా ఇస్తే వాటిలో కూడా mcr-1 జన్యువు తయారవుతుంది. ఇన్ ఫెక్షన్ కు కారణమయ్యే ఏదైనా బ్యాక్టీరియా ఆ జన్యువును ఆక్రమిస్తే అది యాంటీ కొలిస్టిన్ గా మారుతుంది. కోళ్ల ఫాంలలో కొలిస్టిన్ ను విచ్చలవిడిగా ఉపయోగించడం ద్వారా ఈ బ్యాక్టీరియా మనుషులకు కూడా చేరింది. నాలుగు ఖండాల్లోని 30 దేశాల్లో ఈ యాంటి కొలిస్టిన్ బ్యాక్టీరియా ఉందని తేలింది. యాంటిబయాటిక్స్ కు లొంగని కొన్ని సూపర్ బగ్ లలో mcr-1 జన్యువును డాక్టర్లు గుర్తించారు. ఇంతేకాదు ఆ జన్యువు తో పాటు యాంటి కొలిస్టిన్ గా మారిన mcr-2 , mcr-3 mcr-4,mcr-5 జన్యువులు బయటపడ్డాయి. ఒకప్పుడు అరుదుగా ఉండే యాంటి కొలిస్టిన్ బ్యాక్టీరియా ఇప్పుడు కామన్ అయింది. దాని ఫలితంగానే యాంటి బయాటిక్స్ కు కూడా లొంగని ఇన్ ఫెక్షన్ లు మనల్ని సతాయిస్తున్నాయి.

వెంకీస్ లో విచ్చలవిడిగా..

మనదేశంలో జంతువుల మందులు తయారుచేసే ఐదు ప్రముఖ కంపెనీలు కొలిస్టిన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కోళ్ల బరువు పెంచడానికి ప్రత్యామ్నాయంగా దీన్ని ప్రచారం చేస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో వెంకీస్ ఒకటి. వెటర్నరీ మెడిసిన్ ను తయారీతో పాటు పౌల్ట్రీ ఫాం కంపెనీగా ఇండియాలో వెంకీస్ ఫేమస్. KFC,మెక్ డొనాల్డ్స్, పిజ్జాహట్ తో పాటు డోమినోస్ కు వెంకీస్ నుంచే చికెన్ సప్లై అవుతుంది. కోళ్ల బరువును పెంచే మెడిసిన్ గా కోలిస్టిన్ ను వెంకీస్ సరాఫరా చేస్తోంది.

చట్టాన్ని ఉల్లంఘించడం లేదు- వెంకీస్

అయితే కోలిస్టిన్ ను అమ్మి, తాము ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించడం లేదంటోంది వెంకీస్ గ్రూప్. భవిష్యత్తులో కొలిస్టిన్ వినియోగాన్ని ప్రభుత్వం నియంత్రిస్తే తాము కచ్చితంగా పాటిస్తామంటోంది. “ మా యాంటిబయాటిక్ ఉత్పత్తులన్నీ మెడికల్ ట్రీట్ మెంట్ కోసమే. వీటిలో కొన్ని తక్కువ మోతాదు కలవే.అయితే వీటి ఉపయోగంతో కోళ్ల బరువు కూడా పెరుగుతోంది. అయితే తాము మాత్రం యాంటిబయాటిక్స్ ను విచక్షణారహితంగా వాడడాన్ని ప్రోత్సహించము”-వెంకీస్ గ్రూప్

వెంకీస్ నుంచి తమకు సప్లై అయ్యే చికెన్ లో ఎలాంటి యాంటిబయాటిక్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెక్ డొనాల్డ్స్, KFC,పిజ్జాహట్, డొమినోస్ లు స్పష్టం చేశాయి. యాంటిబయాటిక్స్ వాడని చికెన్ ను కస్టమర్లకు ఇవ్వాలన్న తమ విధానాలను వెంకీస్ గౌరవిస్తోందని చెప్పాయి.

కర్టెసీ- The Bureau of Investigative Journalism

పూర్తి పరిశోధన వ్యాసం కోసం https://www.thebureauinvestigates.com/stories/2018-01-30/a-game-of-chicken-how-indian-poultry-farming-is-creating-global-superbugs