కరోనాకు తోడు ఎబోలా.. వణికిపోతున్న జనం
ప్రపంచాన్ని మొత్తాన్ని కరోనా మడతపెట్టేస్తోంది. ఈ పేరు చెబితేనే జనం వణికిపోయే స్థితికి చేరింది. రోజు రోజుకు తన తీవ్రతను పెంచుకుంటూ బలపడిపోతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వ్యాధితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆఫ్రికాలో ఎబోలా మహమ్మారి విజృంభిస్తోంది. దీని కారణంగా కాంగోలో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి జనం భయంతో వణికిపోతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి పాలకులు సూచిస్తున్నారు.
చాలా రోజుల తర్వాత ఈసారి వంగాటా ప్రావిన్స్‌లో ఆరుగురికి ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వారికి చికిత్స అందిస్తుండగా.. నలుగురు మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇప్పుడా దేశం రెండు వైరస్‌లపై యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో 1976లో తొలిసారిగా ఎబోలాను గుర్తించారు. అయితే దీని ద్వారా బయపడిపోవాల్సిన అవసరం ఏమి లేదని డబ్య్లూ హెచ్ఓ స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనాతో పోరాడటంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ.. ఇతర వైరస్‌లపై అప్రమత్తంగా ఉన్నామని డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు.