EC Annouces Gujarat Poll schedule
mictv telugu

గుజరాత్‌లో తీన్మార్

November 3, 2022

EC Annouces Gujarat Poll schedule

గుజరాత్‌లో ఈసారి తీన్మార్ జరగబోతోంది. డబుల్ ఇంజన్ వర్సెస్ సింగిల్ ఇంజన్ వార్ కొనసాగుతోంది. ఆరు శతబ్ధాలుగా బీజేపీ-కాంగ్రెస్ మధ్యే సాగుతోన్న ఈపోటీలోకి ఆప్ దూరింది. నరేంద్ర-భూపేంద్ర సర్కార్‌కు కేజ్రీవాల్ షాక్ ఇవ్వబోతున్నారా?పంజాబ్‌లాగే ఇక్కడ ఊడ్చేస్తారా?కేజ్రీవాల్‌కు అంతా సీనుందా? కాంగ్రెస్ ప్రచారంలో వెనకపడిందా?అసలు గుజరాత్‌లో ఎవరి బలమెంత?

గుజరాత్ మోదీషా అడ్డా

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 1 న తొలి విడత,డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 8న ఫలితాల్ని వెల్లడిస్తారు. గుజరాత్… ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా సొంతరాష్ట్రం.వరుసగా ఆరుసార్లు బీజేపీ విజయం సాధిస్తూ వచ్చింది. ఏడోసారి గెలుపుపై కన్నేసిన కమలం ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టింది. అభివృద్ధే అస్త్రంగా ముందుకెళ్తుంది. ప్రధాని మోదీ ఇటీవల 15 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా గుజరాత్‌ని చుట్టేస్తున్నారు.

EC Annouces Gujarat Poll schedule

ఈసారి తీన్మార్

గుజరాత్‌లో ఈసారి తీన్మార్ జరగబోతోంది. ఎప్పుడు బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది. కానీ పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆప్ గుజరాత్‌లోకి ఎంటరైంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గత ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రచారంలో వెనుకపడింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉంటే మిగతా జాతీయనేతలు ఎవరూ గుజరాత్ వైపు చూడటం లేదు. అభ్యర్థుల్ని ప్రకటించాక ప్రచారం ఊపందుకుంటుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేజ్రీవాల్ కాంగ్రెస్ కన్నా ఒక అడుగు ముందే ఉన్నారు. 3వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ , ఉచిత విద్య, వైద్యం అందిస్తారని ఓటర్లను ఆకట్టుకునేలా కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు గుజరాత్‌ని చుట్టేసిన కేజ్రీవాల్. సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

ప్రస్తుత బలాబలాలు

గుజరాత్‌లో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ 111 స్థానాలతో అధికారంలో ఉంది. 62 స్థానాలతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. బీటీపీ రెండుస్థానాలు, ఎన్సీపీ ఒక స్థానం, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలువగా ఐదు స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. 1990లో జనతాదళ్‌తో కలిసి బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. 1995 నుంచి వరుసగా గెలుస్తూ వస్తుంది. మధ్యలో శంకర్ సిన్హ్ వాఘేలా తిరుగుబాటు చేసిన రెండేళ్లు తప్ప మిగతా అంతా బీజేపీనే అధికారంలో ఉంది. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎన్నికలకు ముందు జరిగిన మోర్బీ కేబుల్ బ్రిడ్జి ఘటన బీజేపీని కలవర పెడుతోంది.

EC Annouces Gujarat Poll schedule

విపక్షాల వ్యూహం

కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనను ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ , ఆప్ తీసుకోబోతున్నాయి. పెరిగిన ధరలు, నిరుద్యోగం అంశాలను కాంగ్రెస్ తెరపైకి తెస్తోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ఈసారి కాస్తా వెనుకపడింది. జాతీయ స్థాయి నేతలెవ్వరూ ప్రచారానికి రావడం లేదు. పంజాబ్‌లో దుమ్మురేపిన ఆప్ ఈసారి గుజరాత్‌లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రజల్ని ఆకట్టుకునే పథకాల్ని ప్రకటిస్తోంది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల్ని రెండు పార్టీలు ఎత్తిచూపుతున్నాయి. ఇక స్థానిక పార్టీలు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటి చేయాలని ఎంఐఎం భావిస్తోంది.

సెమీఫైనల్

2024 జనరల్ ఎలక్షన్స్ కు ముందు సెమీఫైనల్‌గా గుజరాత్ ఎన్నికల్ని బీజేపీ భావిస్తోంది. ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చితీరాలని ప్రణాళిక సిద్ధం చేసింది. బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేంపై ఫోకస్ చేసింది. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. డబుల్ ఇంజన్ సర్కార్‌తో లాభాలు ఏంటో ప్రజలకు బీజేపీ వివరిస్తోంది.