దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఒకే సమయంలో రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి ఎన్నికను కూడా నిర్వహించనున్నారు. నామినేషన్లు వేసే అభ్యర్ధులు కేవలం ఢిల్లీలోనే వేయాల్సి ఉంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే జులై 25తో ముగియనుండడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం జూన్ 15న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్లు వేయడానికి చివరి తేదీ జూన్ 29. ఓటింగ్ జులై 18, ఓట్ల లెక్కింపు జులై 21న జరుగుతాయి. జులై 24 నాటికి ఎన్నికలు పూర్తవుతాయని కమిషనర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి పార్లమెంటు సభ్యులతో పాటు రాష్ట్రాలలోని ఎమ్మెల్యేలు అర్హులు. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, రాష్ట్రాల శాసన మండలి సభ్యులైన ఎమ్మెల్సీలు అనర్హులు. ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉండగా, 1971 జనాభా లెక్కల ఆధారంగా ఓటు విలువను నిర్ధారిస్తారు. 2017 నాటికి ఎలక్టోరోల్ కాలేజీలో 4896 సభ్యులు ఉన్నారు. వారిలో 4120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు ఉన్నారు. ఇదిలా ఉండగా, ఓటు వేసే సభ్యలు కేవలం ఎన్నికల కమిషన్ ఇచ్చిన పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఓటు చెల్లదు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి.