EC transfered munugode Returning Officer
mictv telugu

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌పై వేటు వేసిన ఈసీ

October 20, 2022

మునుగోడు ఉప ఎన్నికలో గుర్తుల కేటాయింపుకు సంబంధించిన వివాదంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తు మార్చిన రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై వేటు వేసింది. ఆయనను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. యుగతులసి పార్టీ అభ్యర్ధికి తొలుత కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును తర్వాత మార్చి బేబీ వాకర్ గుర్తు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఫిర్యాదు అందగా, ఈసీ వేగంగా స్పందించింది. రోడ్డు రోలర్ గుర్తును తిరిగి యుగతులసి పార్టీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు సాయంత్రం లోగా వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. కానీ, వివరణ ఇవ్వకుండానే బాధ్యతల నుంచి తప్పించింది. ఈ పరిణామాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. 2011లో సస్పెండ్ చేసిన రోడ్డురోలర్ గుర్తును ఇప్పుడు తిరిగి ప్రవేశపెట్టడంపై మండిపడ్డారు. ఓటమి తప్పదనే భయంతో దొడ్డిదారిన గెలవాలని చూస్తోందని విమర్శించారు.