Economic recession in 2023.. World Bank report
mictv telugu

2023లో ఆర్ధిక మాంద్యం.. ప్రపంచ బ్యాంకు నివేదిక

September 16, 2022

ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థ తీరుపై ప్రపంచ బ్యాంకు సంచలన నివేదిక వెల్లడించింది. సమీప భవిష్యత్తులో ప్రపంచంలో ఆర్ధిక మాంద్యం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని ప్రకటించింది. బహుశా 2023లోనే మాంద్యం రావొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ విడుదల చేశారు. అనేక దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయని, దీని ద్వారా రుణాలను ఖరీదైన వ్యవహారంగా మార్చి ధరలను తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.

అమెరికా, చైనా, ఐరోపా ఆర్ధిక వ్యవస్థలు బాగా మందగించాయని, ఇలాంటి సమయంలో ఓ మోస్తరు ఎదురు దెబ్బ తగిలినా ఆర్ధిక మాంద్యం విరుచుకుపడుతుందని నివేదికలో వివరించారు. నివేదిక విడుదలనాంతరం డేవిడ్ మాట్లాడుతూ.. ‘ప్రపంచ వృద్ధి బాగా మందగిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు మాంద్యంలోకి వెళ్లిపోవడంతో ముప్పు మరింత పెరిగింది. అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలోని ప్రజలకు దీర్ఘకాలిక వినాశకర ఫలితాలు కొనసాగుతాయని ఆందోళనగా ఉంది. అయితే సరఫరా పరిమితుల నుంచి ఉత్పన్నమయ్యే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి దేశాలు వడ్డీ రేట్లను పెంచడంతోటే ఆగిపోకూడదు. వస్తువుల లభ్యతపై మరింత దృష్టి పెట్టాల’ని హితవు పలికారు. కాగా, 1970 లో వచ్చిన తీవ్ర మాంద్యం లాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయని ఆయన హెచ్చరించారు.