ప్రముఖ మహిళా ఆర్థికవేత్త ఇషర్ అహ్లువాలియా కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

ప్రముఖ మహిళా ఆర్థికవేత్త ఇషర్ అహ్లువాలియా కన్నుమూత

September 26, 2020

Economist Isher Ahluwalia passes away after battling cancer

దేశ ప్రముఖ మహిళా ఆర్థికవేత్త, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ఇషెర్‌ జడ్జ్‌ అహ్లువాలియా(74) కన్నుమూశారు. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. ఇషెర్‌ జడ్జ్‌ అహ్లువాలియా మరణం పట్ల మాజీ కేంద్ర ఆర్థిక శాఖామంత్రి పి చిదంబరం, కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేశ్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్థిక రంగానికి సంబంధించిన రచనలతో ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆహ్లువాలియా ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా సతీమణి. ఆయన సతీమణిగా కాకుండా ఆర్థికవేత్తగా తనకంటూ సొంత గుర్తింపును సంపాదించుకున్నారు. ఆమె ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్(ICRIER)కి ఛైర్‌పర్సన్‌గా సుదీర్ఘకాలం సేవలు అందించారు. గత దశాబ్ధకాలంలో ICRIERకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. విద్య, రచనా రంగాల్లో ఆమె అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం.. ఆమెను 2009లో పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.

మరోవైపు ఆర్థిక రంగంలో భారత్ పురోగతికి సంబంధించి ఆమె పలు రచనలు చేశారు. ఆర్థికవేత్తగా తన కెరీర్‌కు సంబంధించి ఇటీవల ఆమె ‘Breaking Through’ అనే ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని విడుదల చేశారు. ఢిల్లీలోని ప్రెసిడెన్సీ కాలేజీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేట్ చేసిన ఆమె.. మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) ఉద్యోగిగా ఇషెర్ తన కెరీర్ ప్రారంభించారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో ప్రొఫసర్‌గా.. అనంతరం ICRIERలో డైరెక్టర్‌, ఛైర్‌పర్సన్‌గా 15 సంవత్సరాలుగా సేవలు అందించారు.