శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది: ప్రధాని రణిల్ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది: ప్రధాని రణిల్

June 23, 2022

శ్రీలంక దేశంలో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది అని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే స్వయంగా వెల్లడించారు. ఇకపై దేశవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, గ్యాస్, విద్యుత్తు కోరతతో భవిష్యత్తు తరాలు మరింత తీవ్రంగా అల్లాడిపోతాయని అన్నారు. ఇప్పటికే భారతదేశం నుంచి 400 కోట్ల డాలర్లను అప్పుగా తీసుకున్నాం. మరింత సాయాన్ని కోరుతున్నాం. కానీ దీనికి కూడా ఓ పరిమితి ఉంటుందని ఆయన బుధవారం మీడియా వేదికగా శ్రీలంక ప్రజలకు దేశ పరిస్థితిని వివరించారు.

“ఎలాగైనా ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలి. లేకపోతే దేశంలో రాబోయే ఏ సమస్యకు మనం పరిష్కారాన్ని కనుగొనలేం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవటం మంచిది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రమాదకర స్థితిలో అడుగంటిన సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం అంత సులువు కాదు. మొదట్లోనే చర్యలు తీసుకోనే ఉంటే, ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దివాలా తీసిన శ్రీలంకకు ఈ ఏడాది జనవరి నుంచి భారత్ సాయం అందిస్తుంది. ఇప్పటికే భారత్ నుంచి రుణసాయంగా 400 కోట్ల డాలర్లు తీసుకున్నాం. మరింత సాయాన్ని కోరుతున్నాం. దీనికి కూడా ఓ పరిమితి ఉంటుంది. ఆ రుణాలను తిరిగి చెల్లించే ప్రణాళిక కూడా మనవద్ద ఉండాలి. ఇవి విరాళాలేమీ కావు” అని ఆయన అన్నారు.

మరోపక్క గతకొన్ని నెలలక్రితం శ్రీలంక మాజీ ప్రధాని పాలనలో ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ఆకలి మంటలతో అలమటించారు. దీంతో మాజీ ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని అక్కడి ప్రజలు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు తీవ్రంగా ఆందోళనలు, నిరనలు చేపట్టారు. దాంతో మాజీ ప్రధాని మహింద రాజుపక్స తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో మరోసారి శ్రీలంక పరిస్థితి దారుణ దశకు చేరుకుందని ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే స్వయంగా ప్రకటించడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.